Warangal | వరంగల్, జూన్ 20 (నమస్తేతెలంగాణ ప్రతినిధి) : కాంగ్రెస్ ప్రభుత్వంలో కబ్జాలు పెరిగిపోతున్నాయి. పలుకుబడి ఉన్న ప్రజాప్రతినిధులు ఖాళీ భూములపైనే కాదు కట్టిన ఇండ్లపైనా కన్నేస్తున్నారు. కీలక ప్రజాప్రతినిధి భర్త, మాజీ ప్రజాప్రతినిధి ఇప్పుడు ఏకంగా వరంగల్ నగరంలోని ఓ కాలనీని తనదిగా మార్చుకునే ప్రయత్నం చేశాడు. వరంగల్ మహానగరం 56వ డివిజన్లోని జవహర్‌కాలనీ రోడ్డు మారుతి కాలనీలో ఏండ్లుగా ఇండ్లు కట్టుకుని ఉంటున్న ప్రాంతంలో పదిమంది వ్యక్తులు రాత్రికి రాత్రి సిమెంటు ఖనీలు తెచ్చి వేశారు.
బుధవారం మధ్యాహ్నం తర్వాత కొన్ని ఖనీలను మారుతినగర్ కాలనీ 7వ నంబర్ రోడ్డు వెంట, ఖాళీ ప్లాట్లలో, ఇండ్ల ముందు పాతారు. వీటిపై ఎర్ర రంగుతో ఇంగ్లిష్‌లో కేఎం అని రాసి ఉన్నది. అక్కడక్కడా కొన్ని ఖనీలు వేసి ఉన్నాయి. మారుతినగర్ కాలనీలోని ఇప్పుడు ఇండ్లున్న ప్రాంతం మాజీ ప్రజాప్రతినిధి స్థలమేనని, రికార్డుల్లో ఆయన పేరు మీదనే ఉన్నదని ఆయన అనుచరులు చెబుతున్నారు.
మొత్తం ఏరియా తమ నాయకుడిదేనని, కొందరు ఇండ్లు కట్టుకున్నా ఏమీ అనలేదని, ఖాళీగా ఉన్న ప్లాట్లను మాత్రం వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు. సదరు మాజీ ప్రజాప్రతినిధికి ఈ ప్రాంతంలోనే విశాలమైన ఫామ్ హౌస్ ఉన్నది. ఒకప్పుడు నగర శివారు ప్రాంతమైనా ఇప్పుడు నగరం మధ్యలో ఉన్నది. ఫామ్‌హౌస్‌కు సమీపంలోనే మారుతి కాలనీ ఉన్నది. ఈయన ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు ఈ ప్లాట్ల విషయం వివాదాస్పదమైంది.
రికార్డుల ప్రకారం భూమి తన పేరుతోనే ఉన్నదని, తన భూములకు తగిన మేరకు డబ్బులు ఇవ్వాలని అప్పట్లో హెచ్చరించినట్టు స్థానికులు చెబుతున్నారు. వివాదం ఎందుకనే ఉద్దేశంతో చాలామంది అప్పుడే సెటిల్ చేసుకున్నారని తెలిసింది. ఆ తర్వాత మారుతినగర్లో చాలామంది ఇండ్లు కట్టుకున్నారు. కొన్ని ప్లాట్లు ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు ఆ స్థలాలు తమవేనని మాజీ ప్రజాప్రతినిధి అనుచరులు వచ్చి హంగామా చేస్తున్నారు. ప్రభుత్వ పెద్దలు, ఎమ్మెల్యే స్పందించి వాస్తవాలను వెలుగులోకి తెచ్చి న్యాయం చేయాలని కోరుతున్నారు.
అధికారుల మౌనం..
మారుతి కాలనీలో ఖనీలు నాటిన విషయమై పలువురు కాలనీ వాసులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. రోజంతా గడిచినా ఎవరూ రావడంలేదని కాలనీ వాసులు వాపోతున్నారు. ఏండ్ల క్రితం ఇండ్లు కట్టుకుని ఉంటున్న ఈ ప్రాంతంలో ఇప్పుడు కేఎం పేరుతో ఖనీలను పాతడంపై కాలనీ వాసులు ఆందోళన చెందుతున్నారు. స్థానిక కార్పొరేటర్‌కు తమ గోడు చెప్పుకునేందుకు ప్రయత్నిస్తే ఆయన కూడా అందుబాటులోకి రావడంలేదని అంటున్నారు. ఈ డివిజన్ కార్పొరేటర్ ఇటీవలే అధికార పార్టీలో చేరాడు. పెద్దల విషయం తనకెందుకనే ధోరణిలో ఆయన ఎవరినీ కలవడంలేదని తెలిసింది.