హైదరాబాద్, మే 30 (నమస్తే తెలంగాణ): ‘ఇందిరమ్మ రాజ్యంలో రైతులు అరిగోస పడుతున్నరు.. ధాన్యం కొనే దిక్కులేక రోడ్డెకుతున్నరు’ అని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ ఆవేదన వ్యక్తంచేశారు. రెండున్నరేండ్ల కాంగ్రెస్ పాలనలో కష్టాలు, కన్నీళ్లు తప్ప అన్నదాతకు ఒరిగిందేమీలేదని విమర్శించారు. శనివారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ రాష్ట్ర నేత కిశోర్గౌడ్తో కలిసి విలేకరులతో మాట్లాడారు. రైతులంటే సీఎం రేవంత్‌రెడ్డికి లెక్కేలేదని, అందుకే వారి మరణాలను అవహేళన చేస్తున్నారని ధ్వజమెత్తారు. మూడుసార్లు రైతుభరోసా ఎగ్గొట్టారని ఆరోపించారు. ధాన్యం కొనకపోవడంతోనే పదుల సంఖ్యలో రైతులు ప్రాణాలు విడిచారని, వారి కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
మంత్రి ఉత్తమ్‌వి పచ్చి అబద్ధాలు..
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాతే ధాన్యం ఉత్పత్తి పెరిగిందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పచ్చి అబద్ధాలు చెప్పారని బొల్లం మల్లయ్యయాదవ్ మండిపడ్డారు. కేసీఆర్ తొమ్మిదిన్నరేండ్ల పాలనలో అనుసరించిన సాగు విధానాలు, కట్టిన ప్రాజెక్టులతోనే సాగువిస్తీర్ణం గణనీయంగా పెరిగిందని స్పష్టంచేశారు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఉద్ధరించిందేమీ లేదని దెప్పిపొడిచారు. రైతుభరోసా, రుణమాఫీ పేరిట అన్నదాతలను దగా చేశారని దుయ్యబట్టారు. కొబ్బరికాయలు కొట్టేందుకు, సెల్ఫీలు దిగేందుకే ధాన్యం కొనుగోలు కేంద్రాలు పనికివస్తున్నాయని ఎద్దేవాచేశారు. మంత్రి ఉత్తమ్ పౌరసరఫరాశాఖలో ధాన్యం టెండర్లలో అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు.
మోటర్లకు మీటర్లు పెట్టే కుట్రలు..
కాంగ్రెస్ పాలనలో మళ్లీ నీళ్లు, మోటర్ల కష్టాలు మొదలయ్యాయని బొల్లం మల్లయ్యయాదవ్ ఆరోపించారు. నాడు మోటర్లకు మీటర్లు పెడితే ఒప్పుకోమని కేసీఆర్ కేంద్రం ప్రతిపాదన తిరస్కరించారని గుర్తుచేశారు. రేవంత్ ప్రభుత్వం ఆర్డీఎస్ఎస్ స్కీమ్‌లో చేరి మోటర్లకు మీటర్లు పెట్టే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.