వర్ధన్నపేట/దుగ్గొండి/తలమడుగు, డిసెంబర్ 29 : దిగుబడులు రాక.. అప్పులు తీర్చలేక తీవ్ర మనస్తాపంతో ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వరంగల్ జిల్లాలో ఇద్దరు, ఆదిలాబాద్ జిల్లాలో ఒకరు తనువు చాలించారు. వివరాలు ఇలా.. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం దమ్మన్నపేటకు చెందిన రైతు దుంపల రాము లు(45) తనకున్న రెండెకరాలతోపాటు మరో రెండెకరాలు కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. నిరుడు పెద్ద కూతురు పెండ్లి చేశాడు. చిన్న కూతురు ఇంటర్ పూర్తి చేయగా ఆర్థిక ఇబ్బందులతో చదువు ఆపేశాడు. రూ.10 లక్షల వరకు అప్పులు కావడం, చిన్న కూతురు కూడా పెండ్లీడుకు రావడం తో అతడిపై ఒత్తిడి పెరిగింది. వేసవిలో మామిడికాయలు తెంపేందుకు పనికి వె ళ్లిన రాములు భార్య అనిత చెట్టుపై నుంచి పడటంతో కాలు విరిగి ఇంటి వద్దే ఉంటున్నది.
రెండేండ్లుగా పంటలు సరిగా పండక పెట్టుబడులు కూడా రాక తీవ్ర ఆర్థిక ఇ బ్బందులు ఎదుర్కొంటున్నాడు. ప్రస్తుత యాసంగిలో కూడా వరి సాగు చేసేందుకు నారు పోస్తే చలికి చనిపోయింది. అలాగే భూమి చదువు చేసి విత్తనాలు వేసేందుకు కూడా డబ్బులు లేకపోవడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. కుటుంబ భారాన్ని మోయలేక, ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక రెండు రోజులుగా ఎవరితోనూ మాట్లాడకుండా మౌనంగా తిరుగుతున్నాడు. ఈ క్రమంలోనే ఆదివారం తెల్లవారుజామున బావి వద్దకు వెళ్లాడు. ఉద యం 11 గంటల వరకు కూడా ఇంటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన రాములు భార్య అనిత, అతని సోదరుడు సారయ్య బావి వద్దకు వెళ్లి వెతకడంతో చెట్టు పక్కన పడి ఉండి నోటి నుంచి నురగ రావడాన్ని గుర్తించారు. దగ్గరకు వెళ్లి పరిశీలించడంతో రాములు అప్పటికే మృతి చెందడంతో భోరున విలపించారు.
వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం మై సంపల్లికి చెందిన మెకిడె రాజు(48) తనకున్న ఎకరంతో పాటు గ్రామంలో ఆరు ఎ కరాలు, పక్క గ్రామం గోపాలపురంలో ఐ దెకరాలు కౌలుకు తీసుకున్నాడు. మిర్చి, పత్తి సాగు చేశాడు. 10లక్షలకు పైగా పెట్టుబడి పెట్టగా, రెండేండ్లుగా పంటలకు చీడపీడలు సోకి నష్టాలు వచ్చాయి. పెట్టుబడికి తెచ్చిన అప్పులు ఎక్కువై దిగుబడులు రాక మనోవేదన చెందాడు. ఆదివారం తన భార్య రమను పుట్టింటికి పంపి, సోమవారం ఉదయం రాజు ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు.
ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండ లం చర్లపల్లికి చెందిన కనకయాదవ్కు తనకున్న ఐదెకరాలతోపాటు మరో మూడెకరా లు కౌలుకు తీసుకున్నాడు. పత్తి సాగుకు అప్పు చేశాడు. మహారాష్ట్ర బ్యాంకులో రూ.3.85 లక్షలు, ప్రైవేట్‌గా రూ.2.30 ల క్షలు అప్పులు ఉన్నాయి. రుణమాఫీ కాక, దిగుబడులు రాక చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక దిగులుపడ్డాడు. ఆదివారం రాత్రి పురుగుల మందు తాగాడు. రిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై రాధిక తెలిపారు.