బజార్హత్నూర్/మంగపేట, ఆగస్టు 5 : దిగుబడులు రాక.. అప్పులు తీర్చలేక ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాదకర ఘటనలు ఆదిలాబాద్, ములుగు జిల్లాల్లో చోటుచేసుకున్నాయి. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్‌కు చెందిన రైతు పడిపెల్లి విలాస్ (52) తనకున్న 30 గుంటల భూమిలో వ్యవసాయం చేస్తూనే రోజువారి వ్యవసాయ కూలీగా జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల కూతురి వివాహం కోసం రూ.5 లక్షలు అప్పు చేశాడు. దిగుబడి సరిగ్గా రాకపోవడంతో అప్పులు ఎలా తీర్చాలో తెలియక మధనపడ్డాడు. సోమవారం సాయంత్రం ఇంటి ఆవరణలోని బాత్రూమ్లో పురుగుల మందుతాగాడు. కుటుంబ సభ్యులు వెతికినా కనిపించలేదు. మంగళవారం ఉదయం బాత్రూమ్లో చూడగా విగతజీవిగా పడి ఉన్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై సంజయ్‌కుమార్ తెలిపారు.
ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురానికి చెందిన పరమాత్ముల సమ్మయ్య (58) గత కొన్నేండ్లుగా కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. గ్రామంలోని ఫర్టిలైజర్ షాపు యజమాని వేమ సురేశ్ ఐదేండ్ల నుంచి సమ్మయ్యకు వ్యవసాయ భూమిని కౌలుకు ఇప్పించడంతోపాటు విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు తన షాపు నుంచే ఇస్తున్నాడు. పంట పెట్టుబడి కూడా సమకూర్చుతున్నాడు. పంట చేతికి వచ్చాక లెకలు చూసుకునేవారు. రెండు, మూడేండ్లుగా పెట్టుబడికి సంబంధించి లెకలు చేయడం లేదు. ఈ ఏడాది కూడా తొమ్మిది ఎకరాల్లో సమ్మయ్య వరి సాగు చేశాడు. ఈ నెల 3న పంట పెట్టుబడుల లెక్కలు చూసుకోగా, మొదట సురేశ్ సమ్మయ్యకు రూ.1.40 లక్షలు బాకీ తేలాడు. మరుసటి రోజున ఆ డబ్బులను తీసుకునేందుకు సమ్మయ్య సురేశ్ వద్దకు వెళ్లాడు. లెకల్లో పొరపాటు జరిగిందని మళ్లీ చేయగా సమ్మయ్య సురేశ్‌కు రూ.4.61 లక్షలు ఇవ్వాల్సి ఉంటుందని తేలింది. ఆ డబ్బులను పది రోజుల్లో ఇవ్వాలని లేకపోతే బాగుండదని సురేశ్ మందలించాడు. తనకు డబ్బులు వస్తాయని దాంతో అప్పులు తీరుతాయనుకున్న సమ్మయ్య.. తానే సురేశ్‌కు బాకీ పడటంతో మనస్తాపంతో ఈ నెల 4న గడ్డి మందు తాగాడు. కుటుంబ సభ్యులు సమ్మయ్యను వరంగల్ ఎంజీఎం దవాఖానకు తరలించగా, అదే రోజు రాత్రి మృతి చెందాడు.