కురవి(సీరోలు)/వర్ధన్నపేట, డిసెంబర్ 22 : దిగుబడులు రాక.. అప్పులు తీర్చలేక ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనలు మహబూబాబాద్, వరంగల్ జిల్లాలో చోటుచేసుకున్నాయి. వివరాలు ఇలా.. మహబూబాబాద్ జిల్లా సీరోలు మండలం కాంపల్లి గ్రామ శివారు సక్రాంనాయక్ తండాకు చెందిన తేజావత్ శ్రీను (38)కు ఎకరం పొలం ఉన్నది. 30 గుంటల్లో మిర్చి సాగు చేస్తున్నాడు.
పంట పెట్టుబడి కోసం అప్పు చేశాడు. మిర్చి తోటకు బూజు తెగులు ఆశించి పంట దెబ్బతిన్నది. పెద్ద ఎత్తున నష్టం జరగడంతో దాదాపు రూ.3 లక్షల వరకు అప్పు అయ్యింది. వీటిని ఎలా తీర్చాలో తెలియక మనస్తాపానికి గురైన శ్రీను శనివారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన కుటుంబ సభ్యులు అతడిని మహబూబాబాద్‌లోని ఏరియా దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీరోలు ఎస్సై నగేశ్ తెలిపారు.
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని డీసీ తండాకు చెందిన భూక్యా రాజు(40) తనకున్న 20 గుంటల భూమిని సాగు చేయడంతోపాటు మరో ఐదెకరాలు కౌలుకు తీసుకున్నాడు. ఇందులో రెండు ఎకరాల్లో వరి, మూడు ఎకరాల్లో పత్తి సాగు చేస్తున్నాడు. ఈ ఏడాది దిగుబడి ఆశించినంత లేకపోవడంతో నష్టపోయాడు. నిరుడి నుంచి ఇదే పరిస్థితి ఉండటంతో పంటలకు పెట్టుబడిగా తెచ్చిన అప్పులు రూ.10 లక్షలకు పెరిగాయి. వీటిని ఎలా తీర్చాలో తెలియక మానసిక వేదనతో శనివారం ఇంట్లో ఎవరూలేని సమయంలో రాజు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.