హైదరాబాద్, జనవరి 1(నమస్తే తెలంగాణ): రోజు మారినా, స్థలం మారినా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీరు మాత్రం మారడంలేదు. బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ద్వేషం ఏ మాత్రం తగ్గడంలేదు. కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలించుకున్నట్టుగా రెండు రోజుల క్రితమే అసెంబ్లీలో కేసీఆర్ వద్దకు వెళ్లి ఆయనకు నమస్కరించి తాను ఏదో గొప్పపని చేసినట్టుగా ప్రచారం చేసుకున్న రేవంత్‌రెడ్డి.. రెండు రోజులు తిరగక ముందే తన అసలు రూపాన్ని బయట పెట్టుకున్నారు. కేసీఆర్‌పై తన అక్కసును వెళ్లగక్కారు. మరోసారి చావు భాష ఉపయోగించారు. కేసీఆర్ చావును కోరుకోవడం లేదంటూనే పదే పదే అవే ప్రేలాపనలు చేస్తున్నారు. తాజాగా గురువారం కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులకు నీళ్ల అంశంపై ప్రజాభవన్‌లో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ ‘కేసీఆర్‌ను ఉరితీసినా తప్పులేదు’ అంటూ మరోసారి దిగజారుడు, అసభ్యకర, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఇలా ఒక్కసారి కాదు.. రెండుసార్లు అన్నారు. అది కూడా నొక్కి మరీ చెప్పడం ఆయనలోని అసహనాన్ని తెలుపుతున్నది. సమావేశంలో ఆయన వ్యవహారశైలిని గమనిస్తే కేసీఆర్‌పై ఆయనకు ఎంతలా ద్వేషం ఉన్నదనే అంశం అర్థమవుతుంది. ఇలా ఇప్పటికే కేసీఆర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి చేస్తున్న అభ్యంతరకర వ్యాఖ్యలపై ప్రజలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. రేవంత్‌రెడ్డి తీరును ఈసడించుకుంటున్నారు. ప్రజల్లో వ్యతిరేకతతో తాను మారాననే భ్రమలు కల్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకు అసెంబ్లీని కూడా వేదికగా వాడుకున్నారు. కానీ ఆయనలో ఉన్న నిజరూపం మాత్రం ఆ మాయను చీల్చుకుంటూ ఎప్పటికప్పుడు బయటకు వస్తూనే ఉన్నది.
ఏపీతో కుమ్మక్కై పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పండబెట్టడంతోపాటు కృష్ణా జలాల్లో కాంగ్రెస్ సర్కార్ తెలంగాణకు చేస్తున్న అన్యాయంపై బీఆర్ఎస్ పోరాటం చేస్తున్నది. దీనిపై కాంగ్రెస్‌ను నిలదీస్తున్నది. ఇందులో భాగంగా స్వయంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రంగలోకి దిగి కాంగ్రెస్ ద్రోహాన్ని ప్రజల ముందు ఎండగట్టారు. ఆ తర్వాత హరీశ్‌రావు సైతం కాంగ్రెస్ అన్యాయాలను ప్రజలకు వివరించారు. అటు కేసీఆర్, ఇటు హరీశ్‌రావు కలిసి కాంగ్రెస్ సర్కార్‌ను ప్రజల్లో దోషిగా నిలబెట్టారు. దీంతో సీఎం రేవంత్‌రెడ్డి ఇరకాటంలో పడిపోయారు.
తను చేస్తున్న లోగుట్టు మొత్తం తెలంగాణ ప్రజలకు తెలియడంతో డ్యామేజీ కంట్రోల్‌కు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే తనకు బాగా అలవాటైన ఎదురుదాడిని ఎంచుకున్నారు. కేసీఆర్, హరీశ్‌రావు లేవనెత్తిన ప్రశ్నలకు సూటిగా సమాధానాలు చెప్పకుండా రాజకీయ ఆరోపణలకు దిగారు. దొంగే దొంగ అంటూ అరిచినట్టుగా బీఆర్ఎస్పై నెపం నెట్టే ప్రయత్నం చేశారు. తప్పంతా తాను చేసి.. బీఆర్ఎస్ చేసినట్టుగా నమ్మించేందుకు తంటాలు పడ్డారు. ఇక్కడ ఆయనొక విలువైన మాట మాట్లాడారు. ‘ఇక్కడ కూర్చున్న వాళ్లంతా తెలంగాణలో పుట్టి, తెలంగాణలో పెరిగి, తెలంగాణలో పదవులు అనుభవిస్తూ.. తెలంగాణ ప్రజలకు ద్రోహం చేస్తారా? ఆ ఆలోచన ఎవరైనా చేస్తారా?’ అంటూ వ్యాఖ్యానించారు.
తెలంగాణ ఉద్యమంతో, తెలంగాణ తేవడంలో ఎలాంటి పాత్రలేని సీఎం రేవంత్‌రెడ్డి.. తాను తెలంగాణకు ఎలా అన్యాయం చేస్తానని ప్రశ్నిస్తుంటే.. మరి తెలంగాణ కోసం సుదీర్ఘ ఉద్యమం చేసి, తన రాజకీయ జీవితాన్ని పణంగా పెట్టి, చావు అంచుల వరకు వెళ్లిన కేసీఆర్ ఎలా అన్యాయం చేస్తారు? అనే ప్రశ్న ప్రజల నుంచే వ్యక్తమవుతున్నది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి అభాండాలు వేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తన గురువు చంద్రబాబు అనుంగు అధికారి, ఆంధ్రాకు చెందిన, నీళ్లలో తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసిన ఆదిత్యానాథ్ దాస్‌ను రాష్ట్ర సాగునీటిరంగ సలహాదారుగా నియమించుకోవడాన్ని సీఎం మరోసారి సమర్థించుకున్నారు. ఆయన గతంలో తెలంగాణకు చేసిన అన్యాయాన్ని, తెలంగాణకు నీళ్లు రాకుండా చేసిన విధానాలను దాస్తూ.. తెలంగాణకు మేలు చేసేందుకు ఆయన వచ్చినట్టుగా కితాబిచ్చారు.
తెలంగాణలో కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తానంటూ శపథం చేసిన సీఎం రేవంత్‌రెడ్డి ఆ దిశగా అత్యంత నీచమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. తెలంగాణ భవిష్యత్తు, ప్రజలు, రైతుల జీవితాలను పణంగా పెడుతున్నారు. కేసీఆర్‌పై కోపంతో ఇప్పటికే తెలంగాణ జల ప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టును పడావు పెట్టిన రేవంత్‌రెడ్డి.. ఇప్పుడు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును సైతం పడావు పెట్టే దిశగా అడుగులు వేస్తున్నారు. గురువారం నిర్వహించిన సమావేశంలో ఇందుకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై విచారణ వేస్తామంటూ సంకేతాలిచ్చారు. అంటే విచారణ పేరుతో ఆ ప్రాజెక్టును కాలగర్భంలో కలిపే కుట్రకు తెరలేపుతున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇకవేళ ఇదే జరిగితే కేసీఆర్ అన్నట్టుగా ఉమ్మడి మహబూబ్‌నగర్‌కు తీరని ద్రోహం చేసిన పార్టీగా, ప్రభుత్వంగా కాంగ్రెస్ చరిత్రలో నిలిచిపోతుంది.