Khammam | ఖమ్మం వ్యవసాయం, సెప్టెంబర్ 15: ఖమ్మం నగరంలోని 48వ డివిజన్‌కు చెందిన దోరేపల్లి కోటయ్య (70) దశాబ్దాలుగా దానవాయిగూడెం పార్కు ఏరియాలోని గణేశ్‌నగర్‌లో ఓ రేకుల ఇంట్లో నివసిస్తున్నాడు. గతంలో డ్రైవర్‌గా పనిచేసిన ఆయన.. వృద్ధాప్యం కారణంగా కొన్నేండ్లుగా ఇంటి వద్దనే ఉంటున్నాడు. అతడికి ఇద్దరు కుమారులు ఉండగా ఓ కొడుకు మరణించాడు. కుమార్తెకు వివాహం కావడంతో అత్తారింటికి వెళ్లిపోయింది. అవివాహితుడైన మరో కుమారుడు తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్నాడు. భార్య శాంతమ్మతో కలిసి కోటయ్య రేకుల ఇంట్లో నివసిస్తున్నాడు. తనకు వచ్చే రూ.2 వేల ప్రభుత్వ ఆసరా పింఛన్‌తోనే జీవనాన్ని వెళ్లదీస్తున్నాడు. ఈ క్రమంలో గత నెల 31న వచ్చిన మున్నేరు వరద వీరి ఇంటిని ముంచెత్తింది. కోటయ్య, అతటి భార్య శాంతమ్మ ఆ రాత్రి కట్టుబట్టలతో బయటికెళ్లారు.
తెలిసిన వారి ఇంట్లో కొద్దిరోజులు తలదాచుకున్నారు. వరద తగ్గాక ఇంటికి రావడంతో ఇంటి గోడలన్నీ పగుళ్లతో కనిపించాయి. బాత్రూం కూలిపోయింది. అతడి మోపెడ్ వాహనం బురదలో కూరుకుపోయింది. నిత్యావసర సరుకులన్నీ వరదలో కొట్టుకుపోయాయి. వీరు వృద్ధాప్యంలో ఉన్నందున బంధువులు వచ్చి ఇంట్లోని బురదను శుభ్రం చేసి వెళ్లారు. సర్వస్వం కోల్పోయి తీవ్రమైన ఒత్తడికి గురైన కోటయ్య.. ఐదు రోజులుగా మనోవేదనతో ఉంటున్నాడు. గుండె సంబంధిత వ్యాధికి గురైనట్టు తెలిసింది. ఖమ్మంలోని ఓ వైద్యశాలకు తరలించగా మూడురోజులపాటు చికిత్స పొందినట్టు సమాచారం. శనివారం డిశ్చార్జ్ అయి ఇంటికి చేరుకున్నప్పటికీ ఇంటి పరిస్థితిపై ఆందోళన చెందాడు. ఆదివారం తీవ్రమైన గుండెపోటు రావడంతో కోటయ్య ప్రాణాలు వదిలాడని స్థానికులు, కటుంబ సభ్యులు తెలిపారు.
ప్రభుత్వ నిర్లక్ష్యమే ప్రాణం తీసింది : బీఆర్ఎస్ నేతలు
కోటయ్య మృతికి ప్రభుత్వమే కారణమని బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, మాజీ కార్పొరేటర్, ప్రస్తుత కార్పొరేటర్ భర్త తోట రామారావు ఆరోపించారు. కోటయ్య భౌతికకాయానికి నివాళులర్పించిన తోట రామారావు దహన సంస్కారాల నిమిత్తం రూ. 10వేల ఆర్థిక సాయం అందజేశారు. అనంతరం వరదలో మునిగిన కోటయ్య ఇల్లును పరిశీలించారు. వరదలు తగ్గి పక్షం రోజులైనా ఒక్క అధికారి గణేశ్‌నగర్‌లో పర్యటించలేదని మండిపడ్డారు. ఆర్థిక సాయం చేశామని చెబుతున్న ప్రభుత్వ పెద్దలు వాస్తవాలు తెలుసుకోవాలంటున్నారు.