ఇనుగుర్తి, జూలై 24 : పోడు వ్యవసాయం చేసుకుంటున్న గిరిజన మహిళా రైతులపై అటవీశాఖ అధికారులు దాడిచేసిన ఘటన మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం రాముతండాలో జరిగింది. బాధితుల కథనం ప్రకారం.. రాముతండాకు చెందిన గిరిజనులు 25 సంవత్సరాలుగా ఇనుగుర్తి మండలం నార్త్‌జోన్ కంపార్టుమెంట్ 1143లో 25 ఎకరాలలో పోడు వ్యవసాయం చేసుకుంటున్నారు. వారంరోజులుగా వర్షాలు కురుస్తుండడంతో గురువారం విత్తనాలు వేసేందుకు భూమి చదును చేశారు.
ఇంతలోనే అటవీశాఖ అధికారులు వచ్చి గిరిజన మహిళా రైతులపై కర్రలతో విరుచుకుపడ్డారు. అటవీశాఖ అధికారుల దాడులు, వేధింపులు భరించలేక రాముతండాకు చెందిన జర్పుల హచ్చాలి, లకావత్ లాలీ పురుగులమందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. గమనించిన గిరిజనులు వెంటనే వారిని 108లో మహబూబాబాద్‌లోని ఏరియా దవాఖానకు తరలించారు. ఈ సందర్భంగా గిరిజనులు మాట్లాడుతూ .. దవాఖానలో చికిత్స పొందుతున్న వారికి ఏదైనా ప్రమాదం జరిగితే పూర్తి బాధ్యత ప్రభుత్వానిదేనని హెచ్చరించారు.
రాముతండా గిరిజనులు పోడు వ్యవసాయం చేయడానికి యత్నిస్తున్న భూమి పూర్తిగా అటవీ శాఖది. గతంలో ఆ భూములకు ఎలాంటి సర్వేలు నిర్వహించలేదు. అటవీశాఖ పరిధిలోని భూమిలో పోడు వ్యవసాయం చేస్తే చట్టప్రకారం చర్యలు తప్పవు.