Priyanka | సిరిసిల్ల రూరల్, ఏప్రిల్ 24 : ‘మేం చెప్పినట్టే చేయాలె.. మాకు బానిసలా ఉండాలె అన్నంతగా కాంగ్రెస్ నేతలు చేసిన వేధింపులను భరించలేకనే నేను రాజీనామా పత్రాలను డీపీవో, ఎంపీడీవోకు వాట్సాప్‌లో పంపి వెళ్లిపోయిన’ అని రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి పంచాయతీ కార్యదర్శి మంత్రి ప్రియాంక ఆవేదన వ్యక్తం చేసింది. ఈనెల 21న ఆమె అదృశ్యమైనట్టు వార్తలు రాగా తిరుపతి ప్రాంతంలో ఆచూకీ లభించింది. తండ్రి రాజేశం, కుటుంబసభ్యులతో కలిసి బుధవారం రాత్రి క్షేమంగా ఇంటికి చేరింది. గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేశ్ బీ గితేను కలిసి తన గోడు వెళ్లబోసుక్నునది. తాను పడిన ఇబ్బందులను వివరించింది. అనంతరం సిరిసిల్ల పోలీస్ స్టేషన్లో తనను వేధించిన కోదాది మల్లేశ్, గుగ్గిల్ల శ్రీకాంత్, అభినయ్, కొమిరె రాజుపై లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసింది. అనంతరం విలేకరులతో ఆమె మాట్లాడింది.
‘నేను బద్దెనపల్లి పంచాయతీ కార్యదర్శిగా 20నెలల నుం చి పనిచేస్తున్న. గ్రామంలో కోదాది మల్లేశ్, గుగ్గిల్ల శ్రీకాంత్, అభిగౌడ్, కొమిరె రాజు తా ము చెప్పినట్టే నేను వినాలనేవారు. ప్రతి సమావేశానికి ముందు వారికి ఫోన్ చేసి చెప్పాలనేవారు. రేపు సర్పంచ్ ఆయ్యేది మేమే.. ఏమున్నా మాకు చెప్పాలె.. మాకు అనుకూలంగా పనిచెయ్యాలని.. ఆఖరికి నేను వెళ్లిపో యే రోజు కూడా వేధించారు. ఏడాది నుంచి ఎంతో వేదన భరించిన. పైఅధికారులకు ఏడాది నుంచి చెప్పుకుంటూ వస్తున్నా వారు మద్దతివ్వలేదు. మూడుసార్లు కలెక్టర్‌ను కలిసిన. అయినా ఫలితం లేకపోయింది. ఇందిరమ్మ ఇండ్ల కమిటీలోని సభ్యులు అనర్హులకు ఇండ్లు మంజూరు చేయాలని ఒత్తిడి చేశారు. ఒత్తిడి భరించలేక ఇల్లు విడిచి వెళ్దామని నిర్ణయించుకుని తిరుపతికి వెళ్లిపోయా. మా వాళ్లు ట్రేస్ చేసి తీసుకొచ్చారు. భవిష్యత్‌ను కుటుంబసభ్యులతో చర్చించి నిర్ణయిం చుకుంటానని ప్రియాంక వివరించింది.