హైదరాబాద్, మే 9 (నమస్తే తెలంగాణ): మారణహోమం ఏదైనా అందరూ ముక్తకంఠంతో ఖండించాల్సిందేనని ఐక్యరాజ్యసమతి ఆర్థిక, సామాజిక మండలి శాశ్వత సభ్యుడు, తెలంగాణ వాసి ఏలూరి శ్రీనివాసరావు తెలిపారు. ఇస్లామిక్ టెర్రరిజం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నదని చెప్పారు. ఆ ఉగ్రమూలాలను పూర్తిగా నాశనం చేసేలా దెబ్బకొట్టాలని ఆయన అభిప్రాయపడ్డారు. మతం పేరిట జరిగే అరాచకాలను ఉపేక్షించకూడదని చెప్తున్న ఏలూరి శ్రీనివాసరావుతో ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక ఇంటర్వ్యూ.
భారత్-పాక్ మధ్య యుద్ధవాతావరణం మొదలైంది. అంతర్జాతీయంగా ఎలాంటి ప్రభావం ఉంటుంది?
ఇస్లామిక్ టెర్రరిజంతో ప్రపంచంలోని చాలా దేశాలు ఇబ్బందులు పడుతున్నాయి. అమెరికా, శ్రీలంక, ఫిలిప్పీన్స్, థాయ్‌లాండ్, చైనా, ఇండియా, ఇజ్రాయెల్, ఇరాన్, ఇరాక్, టర్కీ, ఆఫ్రికా వంటి చాలా దేశాలు ఉగ్రవాదానికి బాధిత దేశాలే.
ఉగ్రవాదాన్ని పూర్తిగా అంతరించేందుకు ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోవాలి?
పాకిస్థాన్‌కు విదేశీ ఫండింగ్‌ను నిలిపివేయాలి. పాక్ ఉగ్రవాదాన్ని వదిలేసేలా అంతర్జాతీయ సంస్థలు హెచ్చరించాలి. అక్కడి ప్రభుత్వం పటిష్టంగా, ప్రజాస్వామ్యయుతంగా ఉండాలి. టర్కీ నుంచి ఉగ్రవాదాన్ని వదిలించిన ముస్తఫా కెమాల్ వంటి సంస్కర్త రావాలి. ప్రజలకు విద్యావకాశాలు కల్పించాలి. మెరుగైన వసతుల కల్పనకు ఏర్పాట్లు చేయాలి.
ఉగ్రవాదులకు కశ్మీర్‌లోని కొందరు స్థానికుల మద్దతు ఉందనేది నిజమేనంటారా?
అందులో వాస్తవం ఉంది. చాలామంది కశ్మీరీలు తాము ఇండియన్స్ అని చెప్పుకోరు. కశ్మీరీలు అని చెప్పుకుంటారు. అలాగని అందరూ ఉగ్రవాదులు కాదు. వారిలో కొందరు పాకిస్థాన్ ఉగ్రవాదులకు మద్దతు తెలపడం వల్లే అక్కడక్కడా దాడులు జరుగుతున్నాయి. జమ్ముకశ్మీర్ యువతకు ఉపాధి కల్పనకు, పర్యాటక అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి. అక్కడ పౌరులను రెచ్చగొట్టే ఇస్లామిక్ సభలను నిషేధించాలి. రెచ్చగొట్టే ఉపన్యాలపై నిఘాపెట్టాలి. ఉగ్రవాదం పట్ల సానుభూతి కలిగిన వారికి భారతీయ సంస్కృతిని అలవాటు చేయాలి. ఫలితంగా ఉగ్రవాదులకు స్థానికంగా మద్దతు తెలిపేవారి సంఖ్య క్రమంగా తగ్గుతుంది.
ఒకవేళ యుద్ధం సంభవిస్తే.. ఏయే దేశాలు ఎవరికి అండగా నిలిచే అవకాశాలున్నాయి?
తమ దేశాల్లో చాపకింద నీరులా విస్తరిస్తున్న ఇస్లామిక్ టెర్రరిజాన్ని అంతం చేయాలనుకుంటున్న దేశాలన్నీ ఒకటిగా నిలుస్తాయి. చైనాను కూడా ఈ ఉగ్రవాదం వణికించింది. దీంతో ముష్కరులందరినీ ఆ దేశం ఒకేసారి చంపేసింది. ప్రపంచంలోనే అత్యంత వార్ టెక్నాలజీ గల ఇజ్రాయెల్ మనకు సపోర్ట్‌గా ఉంది. ఇరాన్, ఇరాక్, టర్కీ వంటి దేశాలు పాక్‌కు సాయం అందించే అవకాశం ఉండొచ్చు. కాకపోతే వాటిని ఇప్పటికే అమెరికా, ఇజ్రాయెల్ చావుదెబ్బ కొట్టాయి. మొత్తానికి వారం పదిరోజుల్లో ఇది ముగిసిపోవచ్చు. బలూచిస్థాన్ ప్రత్యేక దేశంగా మారే అవకాశం ఉంది.
చైనా పాకిస్థాన్‌కు మద్దతుగా వస్తే.. నష్టం భారీగా ఉండొచ్చని అంతా అంచనా వేస్తున్నారు. అటువంటి పరిస్థితులు ఉన్నాయా?
ఇది నిజం కాదు. పాకిస్థాన్‌కు చైనా ఇన్నాళ్లూ పరోక్షంగా సహకారం అందించినా.. ఇకనుంచి అలా కూడా చేయబోదని సమాచారం ఉంది. ఎందుకంటే అమెరికా పెట్టిన సుంకాల భారాన్ని తగ్గించుకునేందుకు ఇండియా, చైనా ఒక్కటవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌ను సమానం చేయాలంటే ఇండియా-చైనా కలిసి పనిచేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ప్రపంచ ఎకానమీలో ఇండియా 5వ స్థానంలో ఉంది. ఇలాంటి సమయంలో పనికిరాని పాకిస్థాన్ గురించి ఇండియాతో గొడవ పెట్టుకునే ఆలోచన చైనాకు కూడా లేదు.
పాకిస్థాన్ ప్రభుత్వం ఉగ్రవాదుల చేతుల్లో కీలుబొమ్మగా మారిందా?
పాకిస్థాన్ పేరుకే ప్రజాస్వామ్యదేశం. అక్కడ సైన్యం, ఐఎస్ఐ, ఉగ్రవాదులు కలిపి నడిపిస్తున్న ప్రభుత్వమది. మనదేశ పాలనలో సైన్యం జోక్యం చేసుకోదు. పాకిస్థాన్‌లో మాత్రం సైన్యం, ఉగ్రవాదులు ప్రభుత్వాన్ని చేతుల్లోకి తీసుకొనేలా వ్యవస్థ ఉంది.
మీ గురించి, యూఎన్‌లో మీ విధుల గురించి చెప్పండి
మా స్వస్థలం ఖమ్మం జిల్లా. ప్రస్తుతం ఐక్యరాజ్యసమతి ఆర్థిక, సామాజిక మండలి శాశ్వత సభ్యుడిగా ఉన్నాను. యూఎన్వోకు ఇండియా నుంచి ఒకరు రిప్రజెంట్ చేస్తుంటారు. వారిని ఇండియా యూఎన్ పర్మినెంట్ మెంబర్ అని పిలుస్తారు. ఎకానమిక్ అండ్ సోషల్ కౌన్సిల్‌కు మేము ఎన్జీవోల ద్వారా వెళ్లాం. నేను ఇంటర్నేషనల్ కమిషన్ ఆఫ్ కల్చర్ అండ్ డిప్లొమాటిక్ రిలేషన్స్ అనే ఎన్జీవోకు సెక్రటరీ జనరల్‌గా, యూఎన్‌కు పర్మినెంట్ రిప్రజెంటేటివ్‌గా ఉన్నాను. ఇటీవల ఇంటర్నేషనల్ పోలీస్ కమిషన్ గ్లోబల్ కమాండ్ ఇంటర్ గవర్నమెంట్ ఆర్గజైజేషన్లో ఐపీసీ బ్రిగేడియర్ జనరల్ టెరిటరీ కమాండర్‌గా నియమించారు. దాని ప్రధాన కార్యాలయం పిలిప్పీన్స్ రాజధాని మనీలాలో ఉంది.