హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ) : వైద్యారోగ్య రంగానికి గుండెకాయ లాంటి డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్(డీపీహెచ్) విభాగాన్ని రద్దు చేయాలని ప్రభుత్వం ఆలోచించడం దుర్మార్గమని తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ పేర్కొన్నది. ఈ ఆలోచనను విరమించుకోవాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఫసియుద్దీన్, ప్రధాన కార్యదర్శి యాదనాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
మంగళవారం ప్రకటన విడుదల చేశారు. టీవీవీపీ, డీపీహెచ్‌ను కలిపి కొత్త డైరెక్టరేట్ ఏర్పాటు చేయనున్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయా విభాగాల ఉద్యోగులు తీవ్ర ఆందోళనలో ఉన్నట్లు తెలిపారు. టీవీవీపీకి ట్రెజరీ ద్వారా వేతనాలు అందించాలని డిమాండ్ చేశారు.
అబద్ధాలకు తల్లి కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్సీ ఎన్ రామచందర్‌రావు
హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీ అబద్ధాలకు తల్లిలాంటిదని బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్సీ రామచందర్‌రావు విమర్శించారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాహుల్ గాంధీ తీరుతో దేశ ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పారు. రాహుల్ హిందువేనా? అని ప్రశ్నించారు. హిందువు అయితే అటువంటి వ్యాఖ్యలు ఎలా చేస్తారు? అని నిలదీశారు. కిషన్‌రెడ్డి మీద పోటీ చేసింది దానం నాగేందర్ కాబట్టే ఆయన మీద అనర్హత పిటిషన్ వేశామని స్పష్టత ఇచ్చారు.
చారిత్రక ఆలయాల పునరుద్ధరణకు కమిటీ
హైదరాబాద్, జూలై 2(నమస్తే తెలంగాణ): శిథిలావస్థకు చేరుకున్న చారిత్రక ఆలయాలను పరిశీలించి వాటి పరిరక్షణ, పునరుద్ధరణకు ప్రణాళికలు రూపొందించేందుకు ఐదుగురు సభ్యులతో కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి రెవెన్యూ శాఖ(ఎండోమెంట్స్) ముఖ్య కార్యదర్శి ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. కన్వీనర్‌గా పురావస్తు శాఖ డైరెక్టర్, కో-కన్వీనర్‌గా దేవాదాయ శాఖ డైరెక్టర్, సభ్యుడిగా వైటీడీఏ వైస్ చైర్మన్ కృష్ణారావు ఉంటారు. ఆర్కిటెక్ట్ సత్యనారాయణ మూర్తి ప్రత్యేక ఆహ్వానితుడిగా వ్యవహరిస్తారు.
‘డెంటల్ కళాశాల ప్రిన్సిపాల్‌ను తొలిగించాలి’
హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్‌లోని డెంటల్ కాలేజీ ప్రిన్సిపాల్ అరుణను వెంటనే తొలిగించాలని కళాశాల అధ్యాపకు లు, విద్యార్థులు డిమాండ్ చేశారు. లేదంటే నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. మంగళవారం కోఠిలోని డీఎంఈ కార్యాలయానికి తరలివచ్చారు. డీఎంఈ డాక్టర్ వాణిని కలిసి సమ్మె నోటీసు అందజేశారు. దవాఖాన సిబ్బందితోపాటు రోగులు, విద్యార్థులను ప్రిన్సిపాల్ అరుణ అకారణంగా వేధిస్తున్నారని వాపోయారు.