జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ ఢిల్లీకి బదిలీ
మరో నలుగురు సీజేల నియామకం
నేడో, రేపో రాష్ట్రపతి ఆమోదముద్ర
హైదరాబాద్, జూన్ 17 (నమస్తే తెలంగాణ): తెలంగాణ హైకోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్ పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుత సీజే జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ ఢిల్లీ హైకోర్టుకు బదిలీ కానున్నారు. ఈ మేరకు తెలంగాణ సహా ఆరు హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల నియామకాలకు కేంద్రం ఆమోదం తెలిపింది. సుప్రీంకోర్టు కొలీజియం మే 17న చేసిన సిఫారసులను ఆమోదించి, రాష్ట్రపతికి నివేదించింది.
రాష్ట్రపతి ఆమోద ముద్ర అనంతరం సీజేల నియామకాలు అమల్లోకి వస్తాయి. చాలాకాలంగా ఢిల్లీ, హిమాచల్‌ప్రదేశ్, రాజస్థాన్, గౌహతి హైకోర్టులకు సీజేలు లేరు. ఈ హైకోర్టులకు కూడా సీజేలను నియమించారు. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విపిన్ సంఘీని ఉత్తరాఖండ్ హైకోర్టు సీజేగా, గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రష్మిణ్ ఎం.ఛాయను గౌహతి సీజేగా, బాంబే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అంజాద్ సయ్యద్‌ను హిమాచల్‌ప్రదేశ్ సీజేగా, జస్టిస్ ఎస్ఎస్ షిండేను రాజస్థాన్ సీజేగా నియమించాలన్న కొలీజియం సిఫారసులకు కేంద్రం ఆమోదం తెలిపింది. వారంలోపే రాష్ట్రపతి ఆమోద ముద్ర వేస్తారని సమాచారం.