హైదరాబాద్, ఆగసు 29 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని 11 వర్సిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లకు యూజీసీ 7వ పీఆర్సీ అమలుచేసే దిశలో విద్యాశాఖ కసరత్తు చేస్తున్నది. ఇప్పటికే రెగ్యులర్ ఆచార్యులకు 7వ పీఆర్సీ అమలవుతుండగా, తమకు సైతం అమలుచేయాలని కాంట్రాక్ట్ ఆచార్యులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ నేపథ్యంలోనే కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల వివరాలను సమర్పించాలని ఉన్నత విద్యామండలి కార్యదర్శి ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్ గురువారం ఆయా వర్సిటీల రిజిస్ట్రార్లకు లేఖలు రాశారు. మొత్తం 11 వర్సిటీల్లో బడ్జెట్ పోస్టుల్లో 900, సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల్లో 500 మంది కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు పనిచేస్తున్నట్లు ఆయా సంఘాల నేతలు వెల్లడించారు.
వ్యవసాయ యూనివర్సిటీ, ఆగస్టు 29: బీటెక్ అగ్రికల్చరల్, ఇంజినీరింగ్, కన్వీనర్ బీటెక్, ఫుడ్ టెక్నాలజీ కోర్సుల్లో మిగిలిపోయిన సీట్లకు 2న కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్టు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ రఘురామిరెడ్డి ప్రకటనలో తెలిపారు. ఎంపీపీ స్ట్రీమ్ కింద తెలంగాణ ఎఫ్సెట్ 2024 అర్హత లేదా ఇంటర్ తత్సమాన కోర్సులలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు కూడా హాజరుకావచ్చని సూచించారు. అర్హత గలవారు రాజేంద్రనగర్ వర్సిటీ ఎగ్జామ్స్ సెంటర్ వద్ద ఉదయం 10.30కు హాజరు కావాలని, వివరాలకు వెబ్సైట్ www.pjtsau.edu.in సంప్రదించాలని తెలిపారు.
హైదరాబాద్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): రానున్న పండుగల నేపథ్యంలో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా 60 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. దసరా, దీపావళి తదితర పండుగల నేపథ్యంలో అక్టోబర్ 2 నుంచి నవంబర్ 30 వరకు ప్రత్యేక రైళ్ల సర్వీసులను పొడిగించినట్టు పేర్కొన్నది.