హైదరాబాద్, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): అందరి సమిష్టి కృషి వల్లనే రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారని, మరోసారి కష్టపడితే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీదే విజయమని పంచాంగ శ్రవణంలో వేద పండితుడు శ్రీనివాస్‌మూర్తి పేర్కొన్నారు. ఉగాదిని పురస్కరించుకొని మంగళవారం గాంధీభవన్‌లో శ్రీనివాస్‌మూర్తి పంచాంగ శ్రవ ణం చేస్తూ, ప్రజల అభీష్టం మేరకు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో అద్భుతంగా పాలన సాగిస్తున్నదని, రాబోయే రోజుల్లోనూ మరింత అద్భుతంగా పాలన సాగిస్తారని పేర్కొన్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో కార్యకర్తలు, నాయకులు కష్టపడినవిధంగానే కోపాలకు, ఆవేశాలకు గురికాకుండా కష్టపడి పనిచేస్తే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అధిక సీట్లు గెలుచుకుంటుందని, ఇది కేంద్రంలో కూడా అధికారంలోకి రావడానికి దోహదపడుతుందని వివరించారు. కొందరు ప్రముఖుల ఆకస్మిక మరణాలు సంభవిస్తాయని, నేరాలు పెరుగుతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు మహేశ్‌కుమార్‌గౌడ్, జగ్గారెడ్డి, ఎమ్మెల్సీ బీ వెంకట్, ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ చిన్నారెడ్డి, ప్రభుత్వ సలహాదారు హరర వేణుగోపాల్, కాంగ్రెస్ నాయకులు కుమార్‌రావు, నిరంజన్, చల్లా నర్సింహారెడ్డి, మెట్టు సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.
పీసీసీ రేస్‌లో ఉంటా: జగ్గారెడ్డి
కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా, రాకపోయినా రాహుల్‌గాంధీ ప్రతిష్ఠ తగ్గదని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెం ట్ జగ్గారెడ్డి చెప్పారు. మంగళవారం గాంధీభవన్‌లో మీడియాతో చిట్‌చాట్ చేస్తూ, పీసీసీ అధ్యక్షుడిని మార్చితే ఆ రే సులో తన పేరు కచ్చితంగా ఉంటుందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రాజ్యపూజ్యం 16, అవమానం 2 మాత్రమేన ని పంచాంగం చెప్తున్నదని తెలిపారు.