హైదరాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ ) : విశ్వావసు నామ తెలుగు సంవత్సరంలో తెలంగాణలో పాలన కుంటుపడుతుందని, ప్రభుత్వ పథకాలు అంతంతమాత్రంగానే అమలవుతాయని, తద్వారా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉన్నదని పంచాంగకర్త రాజశ్వేర సిద్ధాంతి ఉద్ఘాటించారు. ఆదివారం తెలంగాణ భవన్లో ఘనంగా ఉగాది ఉత్సవాలు నిర్వహించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, రాజ్యసభ సభ్యుడు సురేశ్‌రెడ్డి, ఎమ్మెల్సీలు శ్రీనివాస్‌రెడ్డి, వాణీదేవి, మాజీ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, పువ్వాడ అజయ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, సత్యవతి రాథోడ్, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు మన్నె గోవర్ధన్, కవిత, తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీతారాముల విగ్రహాలకు పూజలు నిర్వహించారు. అనంతరం రాజేశ్వర సిద్ధాంతి పంచాంగ పఠనం చేశారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ది కర్కాటక రాశి అని, ఈ రాశివారికి ఆదాయం 8, వ్యయం 2, రాజ్యపూజ్యం 7, అవమానం 3గా ఉన్నదని తెలిపారు. ఈ ఏడాది కేసీఆర్‌కు అన్ని శుభఫలితాలు కలుగుతాయని, సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారని, మళ్లీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలున్నాయని స్పష్టం చేశారు. వర్షాలు విరివిగా కురుస్తాయని, పంటలు సమృద్ధిగా పండుతాయని, అయితే అతివృష్టి కారణంగా నష్టపోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. రైతులు రుతువుల ఆధారంగా పంటలు వేసుకోవాలని సూచించారు. పప్పు దినుసులు విరివిగా పండుతాయని చెప్పారు. స్వార్థపూరిత ఆలోచనలు పెరిగిపోయి ముఖ్యమంత్రి, మంత్రుల మధ్య విబేధాలు తారాస్థాయికి చేరుతాయని తెలిపారు. రాష్ట్ర పాలనాధిపతి అయిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిది కన్యారాశి అని, ఇన్నాళ్లు మంచిస్థితిలో ఉన్న బృహస్పతి మే 14 తర్వాత స్థానచలనం చెందుతారని, తద్వారా రేవంత్‌రెడ్డికి పదవీ గండం పొంచి ఉందని చెప్పారు.
సీటును కాపాడుకొనేందుకు ఆయన జాగ్రత్తగా ఉండాలని స్పష్టం చేశారు. వార్డు మెంబర్ నుంచి ఎమ్మెల్యే వరకు ఏ ఎన్నిక వచ్చినా బీఆర్ఎస్ విజయం సాధిస్తుందని చెప్పారు. బీఆర్ఎస్ది ధనస్సు రాశి అయినందున పార్టీతోపాటు ముఖ్య నాయకులపై మీడియాలో దుష్ప్రచారం పెరిగిపోతుందని, నాయకులు మీడియాతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రజలతో మమేకమైన నాయకులకు విశేష ఆదరణ లభిస్తుందని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు దెబ్బతింటాయని, కేంద్రం నుంచి వచ్చే నిధులు ప్రజలకు చేరే అవకాశం లేదని పేర్కొన్నారు. ఈ సంవత్సరం చివరి నాటికి పోలీసుల అధికారాలు అపరిమితంగా పెరుగుతాయని, వారు పాలకుల చెప్పుచేతల్లో నడుస్తారని తెలిపారు. చిన్నపరిశ్రమలు వృద్ధి చెందే అవకాశం ఉందని, ముఖ్యంగా వస్త్రపరిశ్రమ ప్రగతి పథంలో ముందుకెళ్తుందని చెప్పారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఒడిదొడుకులు తప్పవని, భూములపై పెట్టుబడి పెట్టేవారు జాగ్రత్తగా ఉండాలని, లేకుంటే నష్టపోయే ప్రమాదం ఉన్నదని హెచ్చరించారు.
హైదరాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ): ‘ఉగాది అంటే షడ్రుచుల వేడుక.. కష్టసుఖాల కలయిక.. పంచాంగ శ్రవణాలు.. తరాలు మారినా తరగని సాంప్రదాయలు..’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభివర్ణించారు. ప్రతి ఒక్కరూ జీవితంలో ఎదురయ్యే ఆటుపోట్లను సమానంగా స్వీకరించాలనే తాత్వికతను బోధించే గొప్ప పండుగ అని ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు. కొత్త ఆశలు, కోటి ఆకాంక్షలతో మొదలైన విశ్వవసు నామ సంవత్సరంలో రాష్ట్ర ప్రజలకు సకల విజయాలు సిద్ధించాలని కేటీఆర్ అభిలషించారు.