హైదరాబాద్, మార్చి 29 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ భవన్లో ఆదివారం ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరుకానున్నారు. ఈ సందర్భంగా జరిగే పంచాంగ శ్రవణం, వేదపండితుల ఆశీర్వచనం, షడ్రుచుల ఉగాది పచ్చడి సేవనంలో ఆయన పాల్గొననున్నారు.
ఎంపీ వద్దిరాజు శుభాకాంక్షలు..
బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజలతోపాటు దేశ, విదేశాల్లో నివసిస్తున్న తెలుగు వారికి ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ఉగాది రోజు షడ్రుచులతో తయారుచేసిన పచ్చడి సేవించడం ఆరోగ్యకరమన్నారు. ఈ పర్వదినం సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి భక్తిశ్రద్ధలతో ఆలయాలను సందర్శించి పంచాంగ శ్రవణం, కవి సమ్మేళనంలో పాల్గొనడంతో శుభం కలుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.