హనుమకొండ చౌరస్తా, జులై 14: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కేంద్రంగా గత కొంతకాలంగా వరుసగా జరుగుతున్న కొన్ని సంఘటనల, అవినీతి ఆరోపణల దృష్ట్యా హెచ్‌సీఏని పూర్తిగా రద్దు చేయాల్సిన అవసరం ఎంతగానో ఉందని వరంగల్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ మాజీ ప్రధాన కార్యదర్శి మార్నేని ఉదయభానురావు పిలుపునిచ్చారు. ఆదివారం హనుమకొండలోని రామారావు క్రికెట్ క్లబ్(ఆర్‌ఎంసీసీ) ప్రధాన కార్యాలయంలో విలేకరుల సమావేశం ఆయన మాట్లాడారు.
జిల్లా క్రికెట్ సంఘం ప్రధాన కార్యదర్శిగా 13 సంవత్సరాల క్రితం పనిచేసిన కాలంలో పలుమార్లు జిల్లా క్రికెట్ సంఘం అభివృద్ధిపై పలు విషయాలు హెచ్‌సీఏ రాష్ర్ట కార్యవర్గం దృష్టికి తీసుకెవెళ్లినప్పటికీ తూతూమంత్రంగా కంటి తుడుపు చర్యలు మాత్రమే చేసి చేతులు దులుపుకున్నారన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, బీసీసీఐ కలిసి రాష్ర్ట క్రికెట్ సంఘం అభివృద్ధి అలాగే గ్రామీణ, మండల, నియోజకవర్గ, జిల్లాస్థాయి కార్యవర్గాలను ప్రక్షాళనచేసి హైదరాబాద్ క్రికెట్ సంఘం స్థానంలో తెలంగాణ రాష్ర్ట క్రికెట్ అసోసియేషన్ ఏర్పాటు చేసి క్రికెట్ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు.
ఇదే విషయమై గతంలో మైసూర్ క్రికెట్ అసోసియేషన్‌గా ఉన్న కర్ణాటక ప్రాంత సంఘాన్ని అనంతరం కర్ణాటక రాష్ర్ట క్రికెట్ అసోసియేషన్‌గా అలాగే మద్రాస్ క్రికెట్ అసోసియేషన్ పేరును తమిళనాడు క్రికెట్ అసోసియేషన్‌గా మార్చిన విధానాన్ని ఆయన సమావేశంలో గుర్తుచేశారు. హెచ్‌సీఏను గుప్పిట్లో పెట్టుకొని అవినీతి, బంధుప్రీతితో ప్రతిభగల క్రీడాకారులకు అన్యాయం చేస్తున్నారని, ఒక గ్రామీణప్రాంత యువకుడు రాష్ట్రస్థాయి, జాతీయస్థాయి క్రికెట్ క్రీడాకారుడిగా రాణించే అవకాశాల్లేవన్నారు. ఈ సమావేశంలో జిల్లా క్రికెట్ సంఘం మాజీ సంయుక్త కార్యదర్శి బండారి ప్రభాకర్, జిల్లా క్రికెట్ సంఘం మాజీ కార్యవర్గ సభ్యులు మట్టెడ కుమారస్వామి పాల్గొన్నారు.