కరీంనగర్/ హైదరాబాద్, జూ న్ 9 (నమస్తే తెలంగాణ) : సర్ప్లస్ టీచర్లు (మిగులు) సర్దుబాటు విషయంలో పాఠశాల విద్యాశాఖ కీలక మార్పులు చేసింది. సర్దుబాటు గడువును ఈ నెల 13 నుంచి జూలై 15 వరకు పొడిగిస్తూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఈవీ నర్సింహారెడ్డి సోమవారం ఆదేశాలిచ్చారు. సర్ప్లస్ టీచర్ల సర్దుబాటుపై మే 28న పాఠశాల విద్యాశాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ నెల 13లోపు ప్రక్రియను పూర్తిచేయాలని స్పష్టంచేసింది. ఇదే విషయంపై ‘నమస్తే తెలంగాణ’లో మూడు కథనాలు ప్రచురితమయ్యాయి. మే 30న ‘సర్ప్లస్ సర్దుబాటులో తొందరపాటు’ ఈ నెల 1న ‘టీచర్ల సర్దుబాటు రగడ’ తాజాగా సోమవారం ‘ఇదేం సర్దుబాటు’ శీర్షిక వరుస కథనాలు ప్రచురితమయ్యాయి.
ఉపాధ్యాయ సంఘాలు సైతం సర్దుబాటును వ్యతిరేకించాయి. ఈ నెల 12న బడులు తెరుచుకోనున్నాయి. సర్కారు బడుల్లో ఎన్రోల్మెంట్ పెంచేందుకు ఈ నెల 19 వరకు బడిబాట నిర్వహిస్తున్నారు. జూలై రెండో వారం వరకు ఎన్రోల్మెంట్పై స్పష్టత వస్తుంది. విద్యార్థుల సంఖ్య తగ్గిందా..? పెరిగిందా..? అన్నది తేలుతుంది. బడులు ప్రారంభమైన తెల్లారే సర్దుబాటు చేయాలనడం తొందరపాటుగా అభివర్ణించగా టీచర్ సం ఘాలు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తంచేశాయి. మొత్తంగా ఈ కథనాలతో సర్కారులో కదలిక వచ్చింది. దీంతో జూలై 15లోపు సర్దుబాటును పూర్తిచేసి, జూలై 22లోపు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌కు నివేదిక సమర్పించాలని ఆదేశించింది.