నిజాంసాగర్ / పెద్దశంకరంపేట/ స్టేషన్‌ఘన్‌పూర్/ఐనవోలు/డిసెంబర్ 13 : రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు వెళ్తూ శనివారం ఆరుగురు దుర్మరణం చెందారు. మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలం తిరుమలాపురం శివారులో 161వ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం చెందారు. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం మాగికి చెందిన కురుమ లింగమయ్య (45), భార్య సాయవ్వ (40), కుమారుడు సాయిలు (18), కూతురు మానస (8) హైదరాబాద్‌లోని లింగంపల్లి నుంచి బైక్‌పై స్వగ్రామానికి ఓటు వేసేందుకు బయలుదేరారు.
మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలం తిరుమలాపురం శివారులో వారి బైక్‌ను గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. పొట్టకూటి కోసం హైదరాబాద్ వలస వెళ్లిన కుటుంబం ఓటు వేసేందుకు వెళ్తూ మృత్యువాత పడటంతో మాగి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండలం రాఘవాపూర్ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం రాంనగర్‌కు చెందిన బుర్ర కల్యాణ్ కుమార్(25) హైదరాబాద్‌లో పనిచేస్తున్నాడు.
ఇదే గ్రామానికి చెందిన బుర్ర నవీన్ (26) అక్కడే సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు. రెండో దశ పోలింగ్‌లో ఓటు వేసేందుకు వరుసకు అన్నదమ్ములైన కల్యాణ్‌కుమార్, నవీన్ శనివారం ద్విచక్రవాహనంపై బయలుదేరారు. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండలం రాఘవాపురం వద్దకు రాగానే గుర్తుతెలియని వాహనం వీరి బైక్‌ను ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు.