CM Revanth Reddy Flexi | మెదక్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న మెదక్ జిల్లాలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఏడుపాయల ఆలయంతో పాటు మెదక్ చర్చిని రేవంత్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అభిమానులు.. రేవంత్ రెడ్డికి స్వాగతం పలుకుతూ భారీగా ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేశారు.
అయితే సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ముగిసిన అనంతరం కొల్చారం మండలం కిష్టాపూర్ గ్రామంలో ఈ ఫ్లెక్సీలను తొలగిస్తుండగా ఘోరం జరిగింది. ఫ్లెక్సీలను తొలగిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్తో ఇద్దరు యువకులు మృతి చెందారు. ఫ్లెక్సీ పూర్తిగా మంటలకు దగ్ధమైంది. ఆ ఇద్దరు యువకులు కూడా పూర్తిగా కాలిపోయారు. మృతదేహాలు నల్లగా మారిపోయాయి. మృతులను కిష్టాపూర్ గ్రామానికి చెందిన అక్కం నవీన్ (22), పసుల ప్రశాంత్ (23) గా గుర్తించారు. మృతుల నివాసాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఈ ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కిష్టాపూర్ గ్రామానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసుల రాకతో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్థానికులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి..
Group-1 | గ్రూప్-1 పరీక్షపై అభ్యర్థుల పిటిషన్ను కొట్టేసిన హైకోర్టు