వరంగల్ : వరంగల్ జిల్లాలో(Warangal) తీవ్ర విషాదం నెలకొంది. అప్పటి వరకు అందరితో కలిసి బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొన్న ఆ యువకులను అంతలోనే మృత్యువు(Youths died )కబళించింది. బైక్ అదుపుతప్పి ఇద్దరు యువకులు మృతిచెందిన సంఘటన రాయపర్తి మండలం కిష్టాపురం గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గురువారం సద్దుల బతుకమ్మ సంబురాలలో పాల్గొన్న అనంతరం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ ఎర్ర శ్రీనివాస్ లలిత కుమారుడు రాజు (20), ఏదునూరి యాకయ్య కల్యాణి కుమారుడు అన్వేష్ (18) కాట్రపల్లిలోని స్నేహితుని వద్దకు బైకు పై వెళ్తున్నారు.
ఈ క్రమంలో శుక్రవారం తెల్లవారుజామున వాంకుడోతు తండ సమీపంలోని తోడేలు బండ తండా వద్దకు రాగానే బైకు అదుపుతప్పి చెట్టును(Bike accident) ఢీ కొట్టారు. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న ఎస్ఐ శ్రావణ్ కుమార్ సంఘటన స్థలానికి చేరుకొని మృతుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కాగా, రాజు, అన్వేష్ మృతితో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.