Viral | కురవి, జూన్ 7 : ప్రేమ గుడ్డిదని ఇందుకే అంటారేమో? సృష్టికి విరుద్ధంగా ఓ ఇద్దరు యువతులు ఒక్కటయ్యారు. వారిని విడదీయడంతో మనస్తాపానికి గురైన ఓ యువతి ఆత్మహత్య చేసుకొంది. విషయం తెలిసి మరో యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు సమాచారం. మహబూబాబాద్ జిల్లాలో కలకలం సృష్టించిన ఈ ఘటన కురవి మండలం మోద్గులగూడెంలో శుక్రవారం వెలుగుచూసింది.
పోలీసుల కథనం ప్రకారం.. మోద్గులగూడెంకు చెందిన కందిపాటి ఎల్లయ్య, మంగమ్మ దంపతుల కూతురు ఉమ (22)కు బయ్యారం మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతితో ఆరు నెలల క్రితం ఇన్స్టా గ్రామ్ ద్వారా పరిచయం ఏర్పడి, చివరికి ప్రేమగా మారింది. ఒకరిని విడిచి ఒకరు ఉండలేని పరిస్థితికి వచ్చిన వారు ఎట్టకేలకు ప్రేమ పెండ్లి చేసుకున్నారు. హైదరాబాద్కు వెళ్లి సహజీవనం చేస్తున్నారు.
కొద్ది రోజుల క్రితం ఉమను ఆమె తల్లిదండ్రులు తీసుకెళ్లడంతోపాటు మరో యువతిని ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు. సీరోలు పోలీసులు సదరు ఇద్దరు యువతులతోపాటు వారి తల్లిదండ్రులకు ఈ నెల ఒకటిన కౌన్సెలింగ్ ఇచ్చారు. ఇద్దరూ ఒప్పుకోవడంతో తల్లిదండ్రులకు అప్పగించారు. దూరమయ్యానని మనస్తాపంతో ఉమ ఈనెల 1న ఎలుకల మందు తాగగా, మహబూబాబాద్ జనరల్ దవాఖానలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది. ప్రేమికురాలు మరణించడంతో మరో యువతి పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు తెలిసింది.