కుంటాల/దుగ్గొండి, నవంబర్ 14: సాగు కోసం పెట్టిన పెట్టుబడిరాక, మరోపక్క రైతుభరోసా అందక అప్పులు ఎలా తీర్చాలనే మనస్తాపంతో ఇద్దరు యువ రైతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన నిర్మల్, వరంగల్ జిల్లాల్లో చోటు చేసుకున్నాయి. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. నిర్మల్ జిల్లా కుంటాల మండలంలోని సూర్యాపూర్‌కు చెందిన రైతు నేరెల్ల లక్ష్మణ్(38) తనకున్న రెండెకరాల్లో సోయా వేశాడు. రూ.30 వేల వరకు పెట్టుబడి పెట్టాడు. అధిక వర్షాలతో వాగు ఉప్పొంగి పంట పూర్తిగా కొట్టుకుపోయి నష్టం వాటిల్లింది. దీనికితోడు ఐదేండ్ల నుంచి అక్కడక్కడ పదెకరాలు కౌలుకు తీసుకుని పత్తి, సోయా సాగు చేస్తున్నాడు. రూ.4 లక్షల వరకు అప్పులు అయ్యా యి. పెట్టిన పెట్టుబడి రాకపోవడం, రైతు భరోసా లేకపోవడంతో చేసిన అప్పులు ఎలా తీర్చాలని మనస్తాపం చెందాడు. బుధవారం రాత్రి పనికి వెళ్తున్నానని చెప్పిన లక్ష్మణ్ చేను వద్దనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
లక్ష్మణ్‌కు భార్య నీలాబాయి, కూతురు శైలజ, కుమారులు సత్యం, సాయికిరణ్ ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్సై భాస్కరాచారి తెలిపారు. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం మహ్మదాపురం గ్రామానికి చెంది న గోగుల భాస్కర్‌రెడ్డి(38) తనకున్న 4 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు చేసుకుంటున్నాడు. దిగుబడి రాక రూ. 6 లక్షల వరకు అప్పులయ్యాయి. ఈ విషయమై ఇంట్లో తరచూ గొడవలు జరుగుతుండేవి. అప్పు తీరకపోవడంతో తీవ్ర మనోవేదనకు గురైన భాస్కర్‌రెడ్డి ఈ నెల 2న ఇంట్లో గడ్డిమందు తాగగా, గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం వరంగల్‌లోని ఎంజీఎం దవాఖానకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. మృతుడి భార్య మమత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై నీలోజు వెంకటేశ్వర్లు తెలిపారు.