Death Certificate | మెదక్ రూరల్, డిసెంబర్ 17 : బతికుండగానే తమ భర్తలు చనిపోయినట్టు ఓ ఇద్దరు మహిళలు డెత్సర్టిఫికెట్లు తీసుకున్నారు. ఆపై రైతు బీమాతోపా టు బ్యాంకులో ఇన్సూరెన్స్ సొమ్మును స్వాహా చేశారు. ఈ ఘటన మెదక్ జిల్లాలో వెలుగుచూసింది.
మెదక్ రూరల్ ఎస్సై మురళి, గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ మండలం గుట్టకిందిపల్లికి చెందిన రైతులు పిట్ల శ్రీను, ఎలిగేటి మల్లేశం హైదరాబాద్లో ఉం టున్నారు. పిట్ల శ్రీను 2021 మే 22న చనిపోయినట్టు అప్పటి పంచాయతీ కార్యదర్శి పంతులు ప్రభాకర్ సహకారంతో డెత్ సర్టిఫికెట్ సృష్టించారు. మరో రైతు ఎలిగేటి మల్లేశం 2023 ఫిబ్రవరి 7న చనిపోయినట్టు ప్రస్తుత పంచాయతీ కార్యదర్శి నరేందర్ సహకారంతో డెత్ సర్టిఫికెట్ పొందారు. ఈ నకిలీ పత్రాల ఆధారంగా రైతుబీమాకు దరఖాస్తు చేసుకున్నారు. నామినీగా ఉన్న పిట్ల శ్రీను భార్య జ్యోతికి రూ.5 లక్షలు, ఎలిగేటి మల్లేశం భార్య శేఖవ్వకు రూ.5 లక్షలు మంజూరయ్యా యి. ఈ మేరకు పిట్ల జ్యోతి, ఎలిగేటి శేఖవ్వపై మండల వ్యవసాయ అధికారి భార్గవి మెదక్ రూరల్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు.