Telangana | థాయిలాండ్‌లో ఇద్దరు తెలంగాణవాసులు అదృశ్యమయ్యారు. ఉద్యోగం కోసం విజిట్ వీసాపై బ్యాంకాక్‌కు వెళ్లిన ఇద్దరు అక్కడ కనిపించకుండా పోయారు. మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన ప్రవాసి ప్రజావాణిలో బాధిత కుటుంబసభ్యులు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళ్తే.. నిజామాబాద్ జిల్లా షెట్పల్లికి చెందిన శనిగరపు అరవింద్, జగిత్యాల జిల్లా ఆత్మకూరుకు చెందిన కొండ సాగర్ విదేశాల్లో ఉద్యోగం కోసం ఒక ఏజెంట్‌ను ఆశ్రయించారు. వారి నుంచి రూ.2లక్షల చొప్పున వసూలు చేసిన సదరు ఏజెంట్ వారికి థాయిలాండ్‌కు విజిట్ వీసా ఇప్పించారు. దీంతో వారు నవంబర్ 11న ముంబై నుంచి బయల్దేరి బ్యాంకాక్‌కు వెళ్లారు. అయితే ఈ నెల 21 నుంచి వారిద్దరి నుంచి ఎలాంటి సమాచారం లేదు. వారి అదృశ్యంపై బాధితుల కుటుంబసభ్యులు ఆందోళన చెందారు. దీంతో అరవింద్ భార్య జల, సాగర్ భార్య కాశమ్మ హైదరాబాద్‌లో మంగళవారం నిర్వహించిన ప్రవాసి ప్రజావాణికి వచ్చి ఫిర్యాదు చేశారు. థాయిలాండ్‌లో తప్పిపోయిన తమ వారి ఆచూకీని తెలుసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డిని వారు కోరారు. ఏజెంట్‌పై కూడా కేసు నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు.