హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్రానికి చెందిన ఇద్దరు ఉపాధ్యాయులను జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం వరించింది. దేశవ్యాప్తంగా మొత్తం 50 మంది ఈ జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. తెలంగాణ నుంచి మొత్తం ఆరుగురి పేర్లను రాష్ట్ర విద్యాశాఖ ప్రతిపాదించగా.. ఇద్దరు టీచర్లు ఎంపికయ్యారు.
అవార్డు గ్రహీతల్లో మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం రెబ్బనపల్లిలోని మండల ప్రజాపరిషత్ పాఠశాలకు చెందిన నూగురి అర్చన, ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం నిపని గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయుడు భేడోద్కర్ సంతోష్‌కుమార్ ఉన్నారు. వీరికి సెప్టెంబర్ 5న ఢిల్లీలో అవార్డులు ప్రదానం చేయనున్నారు.