శివ్వంపేట : తెల్లవారితే కొడుకుకు పదో తరగతి పరీక్షలు మొదలు..! పనిమీద బయటికి వెళ్లిన తండ్రి ఇంటికి వస్తూ రాత్రి రోడ్డు ప్రమాదంలో మృతి..! అప్పటిదాకా సంతోషంగా ఉన్న ఆ కుటుంబంలో ఒక్కసారిగా తీవ్ర విషాదం..! తండ్రి మృతదేహం దగ్గర ఏడుస్తూ కూర్చున్న కొడుకు.. కుటుంబసభ్యులు, బంధువుల ప్రోత్సాహంతో పరీక్ష రాయాలని నిర్ణయించుకున్నాడు. దుఃఖాన్ని దిగమింగుతూ అతడు పరీక్ష రాసేందుకు వెళ్లాడు. మెదక్ జిల్లా శివ్వంపేట మండలంలో ఈ హృదయవిధారక ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. శివ్వంపేట మండలంలోని పాంబండ గ్రామానికి చెందిన కుమ్మరి నాగరాజు (45) శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. తెల్లవారితే కొడుకు ధనుష్ పదవ తరగతి పరీక్షలు రాయాల్సి ఉంది. తండ్రి మృతితో కుటుంబసభ్యులు తీవ్ర శోకంలో మునిగిపోయారు. ఈ విషాద సమయంలో కూడా ధనుష్.. తన కుటుంబసభ్యులు, బంధువులు, గ్రామస్తుల ప్రోత్సాహంతో ఆలోచించి తన భవిష్యత్తు కోసం పరీక్ష రాయాలని నిర్ణయించుకున్నాడు.
తూప్రాన్‌లోని పరీక్షా కేంద్రానికి వెళ్లి పరీక్ష రాశాడు. కొడుకు ధనుష్ పరీక్ష రాసి వచ్చిన అనంతరం పాంబండ గ్రామంలో తండ్రి నాగరాజు అంత్యక్రియల ప్రక్రియను మొదలుపెట్టారు. విషయం తెలుసుకున్న ఉపాధ్యాయులు విద్యార్థి ధనుష్‌ను అభినందించారు. జీవితంలో ఎంతటి కష్టాలు ఎదురైనా చదువుకుని సాధించాలనే పట్టుదల ఉంటే విజయం దక్కుతుందని అన్నారు. తండ్రిని కోల్పోయిన దుఃఖంలో కూడా ధనుష్ పరీక్ష రాసి రావడంతో పలువురు భావోద్వేగానికి లోనై కంటతడి పెట్టారు.