హైదరాబాద్, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ)/గార్ల : అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మహబూబాబాద్ జిల్లా గార్లకు చెందిన ఇద్దరు యువతులు దుర్మరణం చెందారు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం గార్లకు చెందిన పుల్లఖండం నాగేశ్వరరావు, సరిత దంపతుల కుమార్తె మేఘనారాణి (25), ముల్కనూర్కు చెందిన కడియాల కోటేశ్వరరావు, రేణుక దంపతుల కుమార్తె భావన (24) మూడేండ్ల క్రితం ఉన్నత చదువుల కోసం అమెరికాలోని కాలిఫోర్నియాకు వెళ్లారు. ఎమ్మెస్ పూర్తి చేసి ఉద్యోగవేటలో ఉన్నారు. క్రిస్మస్ సెలవులు ఉండటంతో.. మేఘనారాణి, భావన సహా 8 మంది స్నేహితులు రెండు కార్లలో కాలిఫోర్నియాలో విహారయాత్రకు వెళ్లారు. మేఘన, భావన ప్రయాణిస్తున్న కారు మూలమలుపు వద్ద అదుపుతప్పి, లోయలో పడింది. వారిద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.
మేఘన, భావన కుటుంబ సభ్యులను బీఆర్ఎస్ నేతలు పరామర్శించారు. విద్యార్థిని తల్లిదండ్రులను బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పరామర్శించారు. ఉజ్వల భవిష్యత్తు కలిగిన అమ్మాయిలు రోడ్డు ప్రమాదంలో చనిపోయారంటూ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతదేహాలు వెంటనే స్వగ్రామానికి చేరేలా అధికారులతో మాట్లాడుతానని భరోసానిచ్చారు. బాధిత కుటుంబాలను మాజీ ఎంపీ మాలోత్ కవిత పరామర్శించా రు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మృతదేహాలను స్వగ్రామానికి తీసుకొచ్చేలా చర్యలు చేపట్టాల ని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే హరిప్రియానాయక్ ఫోన్ ద్వారా పరామర్శించారు.