Kothagudem | భద్రాద్రి కొత్తగూడెం : కొత్తగూడెంలోని బుధవారం అర్ధరాత్రి ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. రైల్వే అండర్ బ్రిడ్జి కింద ట్యాంకర్ – బైక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని, మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతులను చుంచుపల్లి మండలంలోని రామ్‌నగర్‌కు చెందిన ఏదులాపురం శ్రీనివాస్(50), మధురబస్తీకి చెందిన రాణి(45)గా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
వేగంగా దూసుకొచ్చిన ట్యాంకర్ అదుపుతప్పి బైక్‌ను ఢీకొనడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. అయితే ఈ రైల్వే అండర్ బ్రిడ్జి కింద తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు తెలిపారు. బైక్- ట్యాంకర్ ప్రమాదం కారణంగా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. గురువారం తెల్లవారుజాము వరకు పోలీసులు శ్రమించి, ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.