వాజేడు, నవంబర్ 22 : ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఉన్న పెనుగోలు కాలనీ (బాలలక్ష్మీపురం) గ్రామంలో గురువారం రాత్రి ఇన్ఫార్మర్ నెపంతో మావోయిస్టులు ఇద్దరిని హతమార్చారు. మృతుల కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లరంగు దుస్తులు ధరించిన ముగ్గురు వ్యక్తులు పంచాయతీ కార్యదర్శి ఉయిక రమేశ్ ఇంటికి వచ్చారు. నిద్రలో ఉన్న రమేశ్‌ను లేపి గొడ్డళ్లతో దాడి చేశారు. భార్య ప్రాథేయపడినా వినకుండా నరకడంతో కొన ఊపిరితో ఉన్న రమేశ్‌ను బంధువుల సహాయంతో 108 వాహనంలో ఏటూరునాగారం వైద్యశాలకు తరలించగా మృతి చెందాడు. తరువాత సదరు ముగ్గురు వ్యక్తులు ఉయిక అర్జున్ ఇంటికి వెళ్లారు. బయటకు తీసుకువెళ్లి మాట్లాడి పంపిస్తామని అతని భార్యకు చెప్పారు. అతడు బయటకు రాగానే గొడ్లళ్లతో నరికి హతమార్చారు. వరుసకు అన్నదమ్ములైన రమేశ్, అర్జున్ను మావోయిస్టులు హతమార్చడంతో పెనుగోలు కాలనీ గ్రామస్థులతోపాటు మండల వాసులు ఉలిక్కిపడ్డారు. తమ కదలికలను ఎప్పటికప్పుడు పోలీసులకు చేరవేస్తున్నారని, ఈ విషయమై పలుమార్లు హెచ్చరించినా తీరు మార్చుకోకపోవడంతో హతమార్చినట్టు భారత కమ్యూనిస్ట్ పార్టీ (మావోయిస్ట్టు) వెంకటాపురం-వాజేడు ఏరియా కమిటీ కార్యదర్శి శాంత పేరిట ఘటనా స్థలంలో లేఖలు వదిలివెళ్లారు. రమేశ్, అర్జున్ హత్యలను ఖండిస్తూ జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన కార్యదర్శులు, ఎంపీవోలు, స్థానిక అధికారులు గిరిజన సంఘాల నాయకులు శుక్రవారం మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు.