ఐనవోలు, అక్టోబర్ 6 : హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం వెంకటాపురం గ్రామంలో ఆదివారం పిడుగుపాటుకు ఇద్దరు మృతి చెందగా, మరో ఐదుగురికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రత్యక్ష సాక్షి దౌతుబాజి విజయ కథనం ప్రకారం.. ఐనవోలు మండలం వెంకటాపురంలోని కట్టు కాల్వ వైపు ఉన్న వ్యవసాయ భూముల్లో కొందరు పనులు చేస్తున్నారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఉరుములు మెరుపులతో భారీ వర్షం ప్రారంభం కావడంతో చేన్లలో పనులు చేస్తున్న పలువురు ఎద్దుల కోసం వేసిన రేకుల దొడ్డిలోకి వెళ్లారు. ఈ క్రమంలో ఒక్కసారిగా పిడుగు పడింది. దొడ్డిలో ఉన్న ఏడుగురు కింద పడిపోయారు. కొద్దిసేపటి తర్వాత లేచి చూసేసరికి దౌతుబాజి శ్రావణి(17), కూకట్ల రాజు(24) మృతి చెందారు. రాజు తల్లి కోమలతోపాటు నలుగురు అస్వస్థతకు గురయ్యారు.