RRR | హైదరాబాద్, జనవరి 29(నమస్తే తెలంగాణ) : ప్రాంతీయ రింగురోడ్డు(ట్రిపుల్ఆర్) దక్షిణ భాగం నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం రెండు ప్రత్యామ్నాయాలు సిద్ధం చేస్తున్నది. నిధులు సమకూరితే రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నిర్మించాలని, లేనిపక్షంలో జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ(ఎన్హెచ్ఏఐ)కే అప్పగించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక (డీపీఆర్) రూపకల్పనతోపాటు ప్రాజెక్ట్ అమలుకు సమగ్ర రోడ్‌మ్యాప్ తయారీకి కన్సల్టెంట్లను నియమిస్తున్నది. ట్రిపుల్ఆర్ ఉత్తర, దక్షిణ భాగాలు రెండూ ఎన్హెచ్ఏఐ ఆధ్వర్యంలో నిర్మించాల్సివుంది.
అయితే రాష్ట్ర ప్రభుత్వం దక్షిణ భాగానికి సంబంధించి గతంలో రూపొందించిన అలైన్‌మెంట్‌ను మార్చి ఆర్అండ్బీ శాఖ పర్యవేక్షణలో పనులు చేపట్టాలని భావించింది. నిధుల సమీకరణలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని గ్రహించి అనంతరం ఎన్హెచ్ఏఐ ఆధ్వర్యంలోనే పనులు చేపట్టాలని లేఖ రాసింది. ఓ వైపు కేంద్రాన్ని పనులు చేపట్టాలని కోరుతూనే, మరోవైపు డీపీఆర్‌తోపాటు పనులు చేపట్టేందుకు అవసరమైన సమగ్ర రోడ్ మ్యాప్ తయారీకి కన్సల్టెంట్ల నియామకానికి టెండర్లు ఆహ్వానించి, ఫిబ్రవరి 14వరకు గడువు ఇచ్చింది. పనులు కేంద్రమే చేపడితే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కన్సల్టెంట్లను నియమిస్తున్నదని సర్వత్రా సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
రహదారి నిర్మాణం ఎన్హెచ్ఏఐ ఆధ్వర్యంలో చేపట్టినా, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్మించినా టోల్ ట్యాక్స్ ద్వారానే ఖర్చును పూడ్చుకోవాల్సి ఉంటుంది. ఎన్హెచ్ఏఐ ఆధ్వర్యంలో పనులు చేపడితే ఏ చిన్న సమస్య తలెత్తినా కేంద్రం నుంచి ఆదేశాలు రావాల్సి ఉంటుంది కాబట్టి ప్రాజెక్టు పట్టాలెక్కేందుకు జాప్యం జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. అందుకే తమ ఆధ్వర్యంలోనే నిర్మించేందుకు అవకాశాలు పరిశీలిస్తున్నది.
ఇందులో భాగంగా ఏఏ మార్గాల ద్వారా నిధుల సమీకరణ చేయవచ్చు? ప్రాజెక్టు నియమ నిబంధనలు ఎలా ఉండాలి? భూసేకరణకు నిధుల సమీకరణ ఎలా? తదితర అంశాలపై సమగ్ర రోడ్‌మ్యాప్ తయారీకి రాష్ట్ర ప్రభుత్వం కన్సల్టెంట్‌ను నియమిస్తున్నది. ఒకవేళ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో చేపడితే భూసేకరణ ఖర్చులో కేంద్రం సగం వాటా భరిస్తుందా..? లేదా అనే అంశంపై ప్రభుత్వం తర్జన భర్జన పడుతున్నది. నిధులు సమకూర్చేందుకు ఆర్థిక సంస్థలు, బ్యాంకులు ముందుకొస్తే మాత్రం కేంద్రంతో పనిలేకుండా పూర్తిగా తమ ఆధ్వర్యంలోనే నిర్మించాలని, ఏ అవకాశం లేనిపక్షంలో ఎన్హెచ్ఏఐకే అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.