హైదరాబాద్, జనవరి 18 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కొత్తగా రెండు డిపోలు, ఆరు బస్స్టేషన్ల నిర్మాణంతోపాటు పలు బస్స్టేషన్ల విస్తరణకు ఆర్టీసీ బోర్డు అనుమతిచ్చింది. ఈ మేరకు హైదరాబాద్ బస్‌భవన్‌లో శనివారం నిర్వహించిన సమావేశంలో నిర్ణయించింది. పెద్దపల్లిలో రూ11.70 కోట్లు, ఏటూరునాగారంలో రూ.6.28 కోట్లతో బస్‌డిపోలను ఏర్పాటు చేయనున్నది.
ములుగు జిల్లాకేంద్రంలో రూ.5.11 కోట్లు, అదే జిల్లాలోని మంగపేటలో రూ.51 లక్షలు, సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో రూ. 3.75 కోట్లు, కోదాడలో రూ. 17.95 కోట్లు, ఖమ్మం జిల్లాలో మధిరలో రూ. 10 కోట్లు, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో రూ.3.95 కోట్లతో కొత్త బస్స్టేషన్లను నిర్మించనున్నారు. పెద్దపల్లి జిల్లా మంథని బస్‌స్టేషన్ విస్తరణకు రూ.95లక్షలు కేటాయించారు. కాగా, ఈ పనులను నిర్దేశిత గడువులోగా పూర్తిచేయాలని రవాణాశాఖ మంత్రి పొ న్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు.