
హైదరాబాద్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కొత్తగా ప్రవేశపెట్టిన బీఏ ఆనర్స్ కోర్సులతో విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుందని అధికారులు చెప్పారు. సివిల్స్ రాయాలనుకొనే విద్యార్థులకు ఈ కోర్సులు ఎంతగానో ఉపయోగపడుతాయని అన్నారు. దేశంలోని ప్రముఖ వర్సిటీల్లో కొనసాగుతున్న బీఏ ఆనర్స్ కోర్సులకు ధీటుగా ఈ కోర్సులను నిర్వహించనున్నట్టు రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, వైస్ చైర్మన్ ప్రొఫెసర్ వెంకటరమణ, ఓయూ వీసీ రవీందర్, సెస్ డైరెక్టర్ రేవతి చెప్పారు. గురువారం హైదరాబాద్లో వారు మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుత విద్యాసంవత్సరం నుంచి బీఏ ఆనర్స్ కోర్సుల్లో భాగంగా.. నిజాం, కోఠి ఉమెన్స్ కాలేజీల్లో బీఏ పొలిటికల్ సైన్స్, బీఏ ఎకనామిక్స్ కోర్సులను ప్రారంభించామని చెప్పారు వీటిల్లో చేరడానికి విద్యార్థులు ముందుకు రావాలని కోరారు. విద్యాబోధనతోపాటు ఫీల్డ్ విజిట్, లెర్నింగ్ ప్రాసెస్ వంటి కార్యకలాపాలు ఉంటాయని పేర్కొన్నారు.