Weed killer | తొగుట, ఫిబ్రవరి 07 : తొగుట మండలంలోని ఎల్లారెడ్డిపేట్ గ్రామంలో వరి పంట పొలాలను వ్యవసాయ విస్తరణ అధికారి నాగార్జున పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరి పంటలో కలుపు మందులు వినియోగించే సమయంలో తప్పనిసరిగా తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు.
పొలంలో నీటి మట్టం 2–3 సెంటీమీటర్లు మించకూడదు. కలుపు మందు వాడిన తర్వాత 48 నుండి 72 గంటల వరకు పొలంలోని నీటిని తీసివేయకూడదని చెప్పారు. అలాగే కలుపు ఎక్కువగా ఉందని కారణంగా మోతాదును పెంచరాదు అని సూచించారు.
నాట్లు వేసిన 3–5 రోజుల దశలో, పలుచగా నీరు పెట్టి ఎకరాకు ➡️ 500 మి.లీ. ప్రెటిలాక్లోర్ లేదా ➡️ 1 లీ. బ్యూటాక్లోర్ ను 20 కిలోల ఇసుకతో కలిపి పొలంలో సమానంగా చల్లాలి.
గుళిక రూపంలో ఉపయోగించాలనుకుంటే ఎకరాకు➡️ 4 కిలోల బెన్సల్ఫ్యూరాన్ మిథైల్ + ప్రెటిలాక్లోర్ లేదా➡️ పైరజోసల్ఫ్యూరాన్ + ప్రెటిలాక్లోర్ గుళికలను ఉపయోగించాలి.
నాట్లు వేసిన 20–25 రోజుల దశలో, కలుపు 3–5 ఆకుల దశలో ఉన్నప్పుడు మందులు సమర్థవంతంగా పనిచేస్తాయి. పొలంలో ఏ రకమైన కలుపు ఉందో గుర్తించి దానికి అనుగుణంగా మందులు వాడాలి.
గడ్డిజాతి కలుపు నివారణకు →
ఎకరాకు 300 మి.లీ. సైహలోపాప్ బ్యుటైల్ లేదా 350 మి.లీ. ఫెనాక్సీప్రాప్ ఇథైల్
వెడల్పాకు కలుపు నివారణకు →
ఎకరాకు 1 లీ. 2,4డి ఇథైల్ ఎస్టర్ లేదా 500–600 గ్రా. 2,4డి సోడియం సాల్ట్ మిశ్రమం ఉపయోగించాలి.
కలుపు నివారణకు →
ఎకరాకు 60 గ్రా. పైరజోసల్ఫ్యూరాన్ + బిస్పరిబాక్ సోడియం లేదా 800 మి.లీ. సైహలోపాప్ + పెనాక్సులామ్ లేదా 90 గ్రా. ట్రయోఫమాన్ + ఇథాక్సీ సల్ఫ్యూరాన్ వాడాలి.
రైతులు గమనించాల్సిన ముఖ్య విషయం :
ఏ కలుపు మందు కూడా 100% కలుపును పూర్తిగా నివారించదు. మందు వేసిన తర్వాత మిగిలిన కలుపును చేతితో తొలగించాలి. లేకపోతే ఆ కలుపు విత్తనాలు భవిష్యత్తులో మందులకు ప్రతిరోధం పెంచుతాయి, తద్వారా కలుపు నివారణ కష్టమవుతుందని తెలిపారు