Nani | ‘న్యాచురల్ స్టార్ నాని – దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘ది ప్యారడైజ్’ ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ కొనసాగుతోంది. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘దసరా’ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోవడంతో, ఈ కొత్త ప్రాజెక్టుపై ఇండస్ట్రీలోనే కాకుండా ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ విజయానికే కొనసాగింపుగా ఈసారి మరింత భారీ స్థాయిలో సినిమాను రూపొందిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ శంషాబాద్‌లో ప్రత్యేకంగా వేసిన భారీ సెట్స్‌లో నాని ఇంట్రడక్షన్ సాంగ్‌ను చిత్రీకరిస్తున్నారు. ఈ పాటను సినిమాకే హైలైట్‌గా నిలిచేలా గ్రాండ్‌గా రూపొందిస్తున్నట్లు చిత్ర యూనిట్ చెబుతోంది.
నాని కెరీర్లోనే ఇది అత్యంత మాస్ మరియు స్టైలిష్ ఎంట్రీ సాంగ్ అవుతుందనే టాక్ వినిపిస్తోంది. పాటలో భారీ డ్యాన్స్ మూమెంట్స్, ప్రత్యేక సెట్స్, వందలాది మంది డ్యాన్సర్లు పాల్గొంటుండటంతో ఈ సీన్‌పై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో నాని ‘జడల్’ అనే పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నాడు. రఫ్ అండ్ ఇంటెన్స్ లుక్‌లో ఆయన కనిపించబోతున్నాడని ఇప్పటికే విడుదలైన పోస్టర్ల ద్వారా స్పష్టమైంది. కథ పరంగా కూడా ఇది యాక్షన్, ఎమోషన్, డ్రామా మేళవింపుతో ఉండబోతోందని సమాచారం. మొదట ఈ సినిమాను మార్చి 26న విడుదల చేయాలని భావించినా, ఇప్పుడు 2026 జూలై 25కు వాయిదా వేసే ఆలోచనలో ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
హీరోయిన్గా కయాదు లోహర్ నటిస్తుండగా, సీనియర్ నటులు మోహన్ బాబు, సోనాలి కులకర్ణి, బాబు మోహన్, తనికెళ్ల భరణి తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. బలమైన నటీనటుల ఎంపికతో సినిమాకు మరింత బలం చేకూరినట్లు అభిమానులు భావిస్తున్నారు.సంగీత బాధ్యతలను రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ చేపట్టడం మరో ప్రధాన ఆకర్షణగా మారింది. ఇప్పటికే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, పాటలపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై నిర్మాత సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. విజువల్స్, టెక్నికల్ విలువల పరంగా కూడా సినిమా హాలీవుడ్ స్థాయిలో ఉండబోతుందని చిత్ర యూనిట్ సంకేతాలు ఇస్తోంది. మొత్తంగా ‘దసరా’ తర్వాత నాని – శ్రీకాంత్ ఓదెల కాంబోలో వస్తున్న ‘ది ప్యారడైజ్’ టాలీవుడ్లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్‌గా మారింది. రిలీజ్ డేట్‌పై అధికారిక ప్రకటన వెలువడితే అభిమానుల్లో ఉత్సాహం మరింత రెట్టింపు కావడం ఖాయం.