Gurukula Schools | మెట్పల్లి/ మెట్పల్లి రూరల్/ఎల్లారెడ్డిపేట, ఆగస్టు 9: ఒక్కగానొక్క కొడుకు.. చదువులో చురుకు.. అని గురుకులానికి పంపిస్తే విగతజీవిగా మారాడు. పక్షం రోజుల క్రితమే ఓ విద్యార్థి మరణించినా.. గురుకుల పాఠశాల సిబ్బంది అదే నిర్లక్ష్యం చూపడంతో మరో ప్రాణం పోయిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. వేములవాడ మండలం మర్రిమడ్లకు చెందిన ఎడ్మల కృష్ణారెడ్డి – ప్రియాంక దంపతులకు ఒక్కగానొక్క కొడుకు అనిరుధ్ (12)ను రెండేండ్ల క్రితం జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ బాలుర గురుకుల పాఠశాలలో చేర్పించారు. కృష్ణారెడ్డి బతుకుదెరువు కోసం సౌదీలో ఉంటుండగా ప్రియాంక కొడుకుతో కలిసి తల్లిగారిల్లయిన ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లబొప్పాపూర్‌లో ఉంటున్నది. పంట పొలాల మధ్యలో ఉన్న పాఠశాల ఆవరణలో పాముల సంచారం ఉండడంతో విద్యార్థులు వణికిపోతున్నారు. పెద్దాపూర్ గురుకులంలో ఆరో తరగతి చదువుతున్న ఎడ్మల అనిరుధ్(11) గురువారం రాత్రి తోటి విద్యార్థులతో కలిసి భోజనం చేశాడు. అనంతరం పక్కనే ఉన్న మూత్రశాలకు వెళ్లి పాఠశాలకు తిరిగొచ్చాడు. కొద్దిసేపటి తర్వాత కడుపు నొస్తుందని అనిరుధ్ ఏడ్చుకుంటూ చెప్పినట్టు తోటి విద్యార్థులు తెలిపారు. విద్యార్థులతో కలిసి నేలపై పడుకోగా, తెల్లవారుజామున కడుపునొప్పి ఎక్కువ కావడంతో తోటి విద్యార్థులు కేర్టేకర్లకు తెలిపారు. కేర్టేకర్లు, వాచ్మెన్ హుటాహుటిన విద్యార్థిని కోరుట్ల ప్రభుత్వ దవాఖానకు తరలించగా, వైద్యులు ప్రాథమిక చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో 108 వాహనంలో జగిత్యాల దవాఖానకు తీసుకెళ్లగా, అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు.
మరో ఇద్దరికి అస్వస్థత ఆరో తరగతికి చెందిన మరో ఇద్దరు విద్యార్థులు కడుపునొప్పితో అస్వస్థతకు గురయ్యారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం ఆత్మకూర్‌కు చెందిన మొండి మోక్షిత్, మల్యాల మండలం తాటిపెల్లికి చెందిన అల్లి హేమంత్‌యాదవ్ అనే విద్యార్థులు కడుపునొప్పితో బాధపడగా, మెట్పల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్ దవాఖానకు తరలించారు. ఘటనపై కోరుట్ల పోలీసులు, అధికారులు పాఠశాలకు చేరుకొని విచారణ జరిపారు. జగిత్యాల ఇన్చార్జి డీఈవో జనార్దన్‌రావు స్కూల్‌కు వెళ్లి విచారణ చేపట్టారు. వరుసగా జరుగుతున్న ఘటనలకు పాముకాటే కారణమన్న అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి. పక్షం రోజుల క్రితమే ఓ విద్యార్థి మరణించగా, విద్యార్థులను నూతన భవనంలోకి మార్చారు. శుక్రవారం మరో విద్యార్థి చనిపోయాడని తెసుకుని నమస్తే తెలంగాణ స్కూల్‌కు వెళ్లిన సమయంలోనూ పాము కనిపించడం గమనార్హం.
గురుకుల విద్యాలయ పరిశీలనకు వచ్చిన ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌కు పిల్లల తల్లిదండ్రుల నుంచి చేదు అనుభవం ఎదురైంది. నెలకొన్న సమస్యలు, వరుసగా జరుగుతున్న ఘటనపై నిలదీశారు. పిల్లలకు పడకునేందుకు బెడ్లు లేవని, మూత్రశాలలు, మరుగుదొడ్లు, స్నానాల గదులు దూరంగా ఉన్నాయని ఆయన దృష్టికి తెచ్చారు. అప్పటికే అదనపు కలెక్టర్ రాంబాబు అక్కడికి రావడంతో సమస్యలను తక్షణమే పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
పెద్దాపూర్ గురుకులానికి వెళ్లిన కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల ఘటనపై ఆరా తీయగా, తమకేమీ తెలియదని పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది బదులివ్వడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. పదిహేను రోజుల క్రితం ఓ విద్యార్థి మృతి చెం దినా ఇంత నిర్లక్ష్యంగా, అజాగ్రత్తగా ఎలా ఉన్నారని ప్రశ్నించారు. అనంతరం మెట్పల్లి దవాఖానలో చికిత్స పొందుతున్న హేమంత్యాదవ్ను, నిజామాబాద్‌లో చి కిత్స పొందుతున్న మోక్షిత్‌ను పరామర్శించారు. జగిత్యాలలోని ప్రభుత్వ దవాఖాన లో అనిరుధ్ మృతదేహాన్ని ఎమ్మెల్యే సంజయ్ కల్వకుంట్ల, జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత పరిశీలించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనిరుధ్‌తోపాటు ఇటీవల మృతిచెందిన ఆరపేటకు చెందిన రాజారాపు గణాదిత్య కుటుంబాలకు న్యా యం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పాఠశాలలో ఇలాంటి ఘటనలు జరగడం చాలా బాధాకరమని, విచారణ చేపట్టి సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ గౌతమ్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు.