పెన్పహాడ్/చిన్నశంకరంపేట, ఏప్రిల్ 28 : సాగు కలిసి రాక మరో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. కాళేశ్వరం నీళ్లు రాక పంట ఎండటంతో సూర్యాపేట జిల్లాలో ఒకరు, దిగుబడులు రాక.. అప్పులు తీర్చలేక మెదక్ జిల్లాలో మరొకరు బలవన్మరణానికి పాల్పడ్డారు. సూ ర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలం మేగ్యతండాకు చెందిన అంగోతు నాగేశ్వర్రావు (38) రెండున్నర ఎకరాల్లో వరి సాగు చేశాడు. నీళ్లు లేక పంట ఎండిపోయింది. ఈ నెల 21న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. కుటుంబ సభ్యులు దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మరణించాడు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం గవ్వలపల్లికి చెందిన లింగాపురం సురేశ్ (30) అప్పు తీర్చే మా ర్గం కానరాక సోమవారం చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
వడదెబ్బతో రైతు మృతి ; ధాన్యం ఆరబెట్టి మృత్యువాత
తొర్రూరు, ఏప్రిల్ 28 : మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం గోపాలగిరి గ్రామానికి చెందిన రైతు వడదెబ్బతో సోమవారం మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. గోపాలగిరికి చెందిన ఎన్నమాల సారయ్య(45) ధాన్యాన్ని కొనుగోలు కేంద్రంలో ఆరబోశాడు. ఉదయం నుంచి సాయం త్రం వరకు ధాన్యం ఆరబెట్టి ఇంటికి వచ్చిన సారయ్య ఒకసారిగా సొమ్మసిల్లిపడిపోయాడు. తల్లిదండ్రులు వెంట నే తొర్రూరులోని ఓ ప్రైవేట్ దవాఖానకు తీసుకెళ్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. సారయ్యకు భార్య రజిత, ఇద్దరు పిల్లలు ఉన్నారు.