పాలకుర్తి/చందూర్, ఏప్రిల్ 21: అప్పుల బాధతో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనలు జనగామ, నిజామాబాద్ జిల్లాల్లో చోటుచేసుకున్నాయి. జనగామ జిల్లా పాలకుర్తి మండలం వావిలాలకు చెందిన అనపర్తి లక్ష్మి(52)-శంకరయ్య దంపతులు. వీరు మామిడి తోటలో జీతం ఉన్నారు. ఈ క్రమంలో రెండెకరాల వ్యవసాయ భూమి కొనుగోలు చేశారు. ఇందుకోసం కొంత అప్పు చేశారు. వీటితోపాటు భూమి అమ్మిన వ్యక్తికి రూ.4 లక్షలు ఇవ్వాల్సి ఉన్నది. అంతకుముందే ఉన్న ఎకరం భూమిలో వరి వేయగా ఆశించిన మేర దిగుబడి రాలేదు. ఈ అప్పులు ఎలా తీర్చాలో తెలియక దంపతులు మదనపడుతున్నారు. సోమవారం శంకరయ్య మామిడి తోట నుంచి ఊర్లోకి వెళ్లాడు. తోటలో ఒంటరిగా ఉన్న లక్ష్మి చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈమెకు ఇద్దరు కుమారులు ఉన్నారు. భర్త శంకరయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.
పరువు పోయిందని..
నిజామాబాద్ జిల్లా చందూర్ మండల కేంద్రానికి చెందిన రైతు అర్కల గోపాల్‌రెడ్డి (46) ఎరువులు, పురుగు మందులను ఓ ఫర్టిలైజర్ షాపు నుంచి అరువుమీద కొనుగోలు చేశాడు. వాటికి డబ్బులు చెల్లించకపోవడంతో దుకాణ యజమాని కోర్టు నుంచి నోటీసులు పంపించాడు. పొలం ఎవరికీ విక్రయించవద్దని నోటీసు రావడంతోపాటు గ్రామంలో చాటింపు వేయించారు. గ్రామంలో పరువు పోయిందని తీవ్ర మనస్తాపం చెందిన రైతు సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్టు ఎస్సై మహేశ్ తెలిపారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు.