రేగొండ(గోరికొత్తపల్లి)/అక్కన్నపేట, ఏప్రిల్ 15 : సాగుకు నీళ్లు లేక పంటలు ఎండిపోవడంతో తీవ్రమనస్తాపం చెందిన ఇద్దరు రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాదకర ఘటనలు జయశంకర్ భూపాలపల్లి, సిద్దిపేట జిల్లాల్లో చోటుచేసుకున్నాయి. కుటుంబ సభ్యులు, గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. భూపాలపల్లి జిల్లా గోరికొత్తపల్లి మండలం జగ్గయ్యపేటకు చెందిన బోలవేని రాజయ్య(55) తనకున్న మూడెకరాల్లో పత్తి, మక్కజొన్న సాగు చేశాడు. పంట పెట్టుబడి కోసం అప్పులు చేశాడు. ఈ ఏడాది సరిగా పంటలు పండక, పండిన పంటకు సరైన గిట్టుబాటు ధర దక్కలేదు. దీంతోపాటు యాసంగిలో సాగునీరు అందక పంటలు ఎండిపోయాయి. పంట కోసం తెచ్చిన సుమారు రూ.5 లక్షలకుపైగా అప్పులు ఎలా తీర్చాలో తెలియక కుంగిపోయాడు. ఈ క్రమంలో ఆదివారం ఇంట్లో పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు వరంగల్ ఎంజీఎం దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తుర్కవానికుంటలో రైతు శ్రీనివాస్‌రెడ్డి
సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం పోతారం(జే) గ్రామ పరిధిలోని తుర్కవానికుంటకు చెందిన రైతు బోడ శ్రీనివాస్‌రెడ్డి(40) గతంలో దుబాయ్‌కి వెళ్లి తిరిగి స్వగ్రామం వచ్చి వ్యవసాయం చేసుకుంటున్నాడు. తనకున్న ఐదెకరాల్లో ఇటీవల నాలుగు బోర్లు వేసినా చుక్క నీరు రాలేదు. దీనికితోడు నీరందక వేసిన పంట ఎండిపోవడంతో తీవ్రంగా నష్టపోయాడు. తిరిగి మళ్లీ దుబాయ్ వెళ్లేందుకు సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలానికి చెందిన ఓ ఏజెంట్‌కు రూ. 4 లక్షలు ఇచ్చాడు. సదరు వ్యక్తి దుబాయ్‌కి పంపించకుండా కాలయాపన చేశాడు. తిరిగి డబ్బులు ఇవ్వాలంటూ ఒత్తిడి చేస్తే రేపు, మాపంటూ వాయిదాలతో కాలం వెళ్లదీశాడు. చివరికి గల్ఫ్ ఏజెంట్ చేతిలో మోసపోయానని గ్రహించిన శ్రీనివాస్‌రెడ్డికి అప్పటికే సుమారు రూ. 15 లక్షల వరకు ఉన్న అప్పుల భారం భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్టు సూసైడ్ నోట్ రాశాడు. తనను మోసం చేసిన ఏజెంట్‌ను వదిలి పెట్టవద్దని, తన కుటుంబ సభ్యులను ఇబ్బందులకు గురిచేయొద్దని లేఖలో రాశాడు. ఈ మేరకు మంగళవారం ఆయన ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య సబిత, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై విజయ్‌భాస్కర్ తెలిపారు.
ధాన్యం ఆరబోస్తూ.. గుండెపోటుతో రైతు మృతిజగిత్యాల జిల్లా ప
కథలాపూర్, ఏప్రిల్ 15 : కొనుగోలు కేంద్రంలో పోసిన ధాన్యాన్ని ఆరబోస్తూ కుప్పకూలి ఓ రైతు గుండెపోటుతో మృత్యువాతపడ్డాడు. ఈ విషాదకర ఘటన జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం దూలూర్‌లో చోటుచేసుకున్నది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. దూలూర్ గ్రామానికి చెందిన రైతు పూండ్ర జలపతిరెడ్డి(50) గ్రామ శివారులోని కొనుగోలు కేంద్రంలో పోసిన వరి ధాన్యాన్ని ఆరబెట్టేందుకు మంగళవారం ఉదయం వెళ్లాడు. ధాన్యాన్ని ఆరబోస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయాడు. గుండెపోటు వచ్చిందని గమనించిన అక్కడున్న రైతులు సీపీఆర్ చేసి, చికిత్స కోసం కథలాపూర్‌లోని ప్రైవేట్ దవాఖానకు తరలించారు. అయితే అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు పేర్కొన్నారు. మృతుడికి భార్య లక్ష్మి, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.