హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ): వాహనాదారుల పెండింగ్ చలాన్ల చెల్లింపునకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన రాయితీ గడువు రెండ్రోజుల్లో ముగియనున్నది. సర్కారు తొలుత మార్చి ఒకటి నుంచి నెలరోజులపాటు ఈ అవకాశాన్నిచ్చింది. వాహనదారుల నుంచి భారీ స్పందన రావడంతో రాయితీ గడువును ఈ నెల 15 వరకు పొడిగించింది.
ఇప్పటివరకు 2.9 కోట్ల పెండింగ్ చలాన్లు ఉల్లంఘనదారులు చెల్లించారు. తద్వారా ప్రభుత్వానికి రూ.292 కోట్ల వరకు ఆదాయం వచ్చింది. అధికారులు విధించిన జరిమానాల్లో ద్విచక్రవాహనాలు, ఆటోలకు 75 శాతం, కార్లు, భారీ వాహనాలకు 50 శాతం, ఆర్టీసీ బస్సులకు 70 శాతం, కరోనా సమయంలో మాస్క్ ధరించని వారికి 90 శాతం రాయితీ కల్పించారు. వీరంతా ఆన్లైన్, మీ సేవ కేంద్రాల్లో చలాన్లు చెల్లించవచ్చు.