హైదరాబాద్, జూన్ 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు ఎండలు మండే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొన్నది. ఆ తర్వాత ఎండల తీవ్రత కాస్త తగ్గే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ నెల 19న కొంతమేర, 20, 21 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడ మోస్తరు వర్షాలు కరిసే అవకాశం ఉందని సూచించింది. ఒకవేళ రుతుపవనాలు వ్యాపిస్తే ఉరుములు, మెరుపులతో వర్షాలు పడతాయని పేర్కొంది. ఆది, సోమవారాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నదని చెప్పింది. శనివారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఎండలు దంచి కొట్టాయి. ఖమ్మంలో 42 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదు కాగా, రామగుండంలో40.6, హనుమకొండలో 40, ఆదిలాబాద్లో 39.6, నిజామాబాద్లో 38.2, హైదరాబాద్లో 37 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్టు పేర్కొంది.