కామారెడ్డి : జిల్లాలో కురుస్తున్న అతి భారీ వర్షాలు మూలంగా మరో రెండు రోజులు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటిస్తూ జిల్లా విద్యాశాఖ అధికారి రాజు ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, రాష్ట్రవ్యాప్తంగా రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. నిన్న కురిసిన భారీ వర్షాలకు కామారెడ్డి జిల్లా అతలాకుతలమవ్వగా.. ఇవాళ కూడా ఆ జిల్లాలో మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే.. మరో రెండు మూడు గంటల్లో జగిత్యాల, నిజామాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. 62-87 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. ఈ మేరకు ఈ రెండు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.
హన్మకొండ, కామారెడ్డి, కరీంనగర్, మేడ్చల్ మల్కాజిగిరి, మెదక్, నిర్మల్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్ జిల్లాల్లో తదుపరి రెండు మూడు గంటల్లో మోస్తరు వర్షం కురుస్తుందని తెలిపింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జనగాం, ఖమ్మం, కుమ్రంభీం ఆసిఫాబాద్, మహబూబ్బాద్, ములుగు, నల్గొండ, రంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో తదుపరి రెండు మూడు గంటల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పింది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
ఇవాళ భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, జయశంకర్ భూపాలపల్లి, జనగాం, కామారెడ్డి, ఖమ్మం, మహబూబాబాద్, మెదక్, ములుగు, నల్గొండ, నిర్మల్, నిజామాబాద్, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.