హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టులపై సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం సచివాలయంలో సమీక్షించారు. విస్తరణ పనులపై మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డితోపాటు ఇతర అధికారులతో ప్రత్యేకంగా సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి రెండు ఎయిర్పోర్ట్ కొత్త మార్గాలపై దిశానిర్దేశం చేశారు. ఒక మార్గాన్ని ఎంజీబీఎస్, ఫలక్‌నుమా నుంచి, రెండో మార్గాన్ని ఎల్బీనగర్, చాంద్రాయణగుట్ట మీదుగా పరిశీలించాలని సూచించారు. ఇందులో మైలార్‌దేవ్‌పల్లి, జల్పల్లి, పీ7 రోడ్డు మీదుగా ఎయిర్పోర్ట్ వరకు, మరొకటి బార్కాస్, పహాడీషరీఫ్, శ్రీశైలం రోడ్డు మీదుగా ఎయిర్పోర్ట్ మార్గాలను పరిశీలనకు ప్రతిపాదించాలని సూచించారు.
ఎయిర్పోర్ట్ మెట్రో అలైన్‌మెంట్‌ను ఓల్డ్ సిటీ మీదుగా ఎంజీబీఎస్, ఫలక్‌నుమా, ఎల్బీనగర్ ప్రాంతాలను కలుపుతూ నిర్మించేలా చూడాలని సూచించారు. హైదరాబాద్ విశ్వనగరంగా ఎదుగుతున్న క్రమంలో అన్ని ప్రాంతాల నుంచి మెట్రో రవాణా సౌకర్యం కల్పించాలని పేర్కొన్నారు. కందుకూరు సమీపంలో ఫార్మా సీటీ కోసం సేకరించిన భారీ విస్తీర్ణంలో పర్యావరణహిత మెగా టౌన్‌షిప్‌కు ప్రణాళిక రూపొదించాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులకు సూచించారు. సమావేశంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీఎస్ శాంతికుమారి, పురపాలక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అర్వింద్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.