హైదరాబాద్, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ): తెలంగాణ హైకోర్టులో పనిచేస్తున్న ఇద్దరు న్యాయమూర్తులను బదిలీ చేయాలని సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్‌ఖన్నా నేతృత్వంలోని కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. జస్టిస్ పెరుగు శ్రీసుధను కర్ణాటక హైకోర్టుకు, జస్టిస్‌కే సురేందర్‌ను మద్రాస్ హైకోర్టుకు బదిలీ చేయాలని సూచించింది. ఇదే విధంగా ఏపీ హైకోర్టులో పనిచేస్తన్న జస్టిస్ కే మన్మథరావును కర్ణాటక హైకోర్టుకు, కర్ణాటక హైకోర్టులో పనిచేస్తున్న జస్టిస్ హేమంత్ చందన్గౌడర్ను మద్రాస్ హైకోర్టుకు, జస్టిస్ కృష్ణన్ నటరాజన్‌ను కేరళకు, జస్టిస్ దీక్షిత్ కృష్ణ శ్రీపద్ను ఒడిశాకు, జస్టిస్ ఎన్ శ్రీనివాసన్ సంజయ్గౌడను గుజరాత్‌కు బదిలీ చేయాలని సిఫార్సు చేసింది. తెలంగాణ హైకోర్టు నుంచి ఇద్దరు జడ్జీలు రిలీవ్ అయితే మిగిలిన న్యాయమూర్తుల సంఖ్య 28కి తగ్గుతుంది.
హోంగార్డుల కోసం చట్ట సవరణ చేయండి ; కేంద్ర హోంశాఖ సహాయమంత్రికి హోంగార్డుల వినతి
హైదరాబాద్, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ) : దేశంలో పనిచేస్తున్న హోంగార్డులకు ఉద్యోగ భద్రత కల్పించే విధంగా చట్ట సవరణ చేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కు హోంగార్డులు వినతి పత్రం అందజేశారు. అదేవిధంగా రాష్ట్రంలో నిలిపివేసిన కారుణ్య నియామకాలను అమలు చేసేలా సీఎంకు సిఫారసు చేయాలని కోరారు. హోంగార్డుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పుప్పాల అశోక్, రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు ప్రకాశ్, కమిటీ సభ్యులు కిరణ్, పవన్, మరణించిన హోంగార్డ్ కుటుంబసభ్యులు నాగరాజు, పాషా తదితరులు పాల్గొన్నారు.