హైదరాబాద్, మే 30 (నమస్తే తెలంగాణ) : తెలంగాణకు తదుపరి పోలీస్ బాస్ (డీజీపీ) ఎవరు? ఇప్పుడు ఈ ప్రశ్న పోలీస్ శాఖను, రాజకీయ నేతలను తొలిచేస్తున్నది. పోలీస్ శాఖలో అత్యున్నతమైన ఈ పోస్టు కోసం ఆ శాఖలో ఇద్దరు అధికారుల మధ్య కనిపించని యుద్ధం జరుగుతున్నది. ఎంతో సమర్థులైన ఆ ఇద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో రాష్ట్ర ప్రభుత్వం ఎటూ తేల్చుకోలేకపోతున్నట్టు తెలిసింది. దీంతో వారిద్దరూ ఎవరిస్థాయిలో వారు పైరవీలు సాగిస్తున్నట్టు సమాచారం. అందివచ్చిన ఏ అవకాశాన్నీ వదులుకోకుండా ఒకరు ఢిల్లీ స్థాయిలో, మరొకరు రాష్ట్రస్థాయిలో పట్టువదలని విక్రమార్కుల్లా ప్రయత్నిస్తున్నారు. వీరిలో ఒకరికి సీనియర్ ఐపీఎస్‌గా, మంచి అడ్మినిస్ట్రేటర్‌గా పేరున్నప్పటికీ డీజీపీ పదవి దక్కేలా మేనేజ్ చేసుకునే రాజకీయ వ్యవస్థ లేదు. అదే పోస్టును ఎప్పట్నుంచో ఆశిస్తున్న మరో సీనియర్ ఐపీఎస్‌కు ప్రభుత్వ పెద్దలతో మంచి సంబంధాలున్నప్పటికీ ఇటీవల ఆయన పనితీరు కొంత ఇబ్బందికరంగా మారడంతోపాటు భూదాన్ పోచంపల్లి భూముల వ్యవహారం ఆయన మెడకు చుట్టుకున్నది. దీంతో ఎలాగోలా ఆ కేసును క్లియర్ చేసుకునే పనిలో ఆ అధికారి నిమగ్నమయ్యారు. రెండుసార్లు త్రుటిలో చేజారిన పోలీస్ బాస్ పదవిని ఈ సారి ఎలాగైనా దక్కించుకోవాలనే కసితో ఇంకో సీనియర్ అధికారి ఢిల్లీస్థాయిలో ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం.
ఈసారి కూడా తనకంటే మూడేండ్ల జూనియర్‌కు డీజీపీ పదవి వస్తే ఎలా? అని ఓ సీనియర్ ఐపీఎస్ మథనపడుతున్నట్టు వినికిడి. మహేందర్‌రెడ్డి తర్వాత ఆ స్థాయిలో మంచి అడ్మినిస్ట్రేటర్‌గా, శాంతిభద్రతలను అనునిత్యం కాపాడే మంచి పాలనాదక్షుడిగా పేరున్నప్పటికీ పోలీస్ బాస్ పదవి వరించకపోవడం ఆయన్ని ఆలోచనలో పడేసిందని పలువురు సీనియర్ ఐపీఎస్‌లు చెప్తున్నారు. డిగ్రీ కాగానే ఐపీఎస్ కొట్టిన ఆయన.. పోలీస్ శాఖలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. ఎలాంటి అవినీతి మరకలు లేని ఆయన.. ఎక్కడ పోస్టింగ్ ఇచ్చినా తనదైన మార్కు చూపించారు. రాజకీయ నాయకుల మాటలు వినకుండా ఆయన న్యా యం వైపే నిలబడ్డ సందర్భాలు అనేకం ఉన్నాయి. గత ఎన్నికల సమయంలో హైదరాబాద్ కమిషనర్‌గా ఉన్న ఆయన్ను ఎన్నికల సంఘం పక్కన పెట్టడం మినహా ఎలాంటి రిమార్కూ లేదు.
భూదాన్ భూముల భూములలో ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు ఉండటం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగా రంలోని 181, 182, 194 195వ సర్వే నంబర్లలో పలువురు సీనియర్ ఐఏఎస్, ఐసీఎస్‌లు భూదాన్ భూములు కొన్నారు. ఈ వ్యవహారంపై సీబీఐ, ఈడీ దర్యాప్తునకు ఆదేశించాలని దాఖలైన పిటిషన్‌పై ఇటీవల హైకోర్టు విచారణ చేపట్టింది. ఆ కుంభకోణంలో ఐపీఎస్, ఐఏఎస్‌లు ఉండటంపై విస్మయం వ్యక్తంచేసింది. ఆ భూములు అన్యాక్రాంతం కాకుండా చూసేందుకు ఎలాంటి లావాదేవీలను అనుమతించవద్దని తేల్చిచెప్పింది. ఈ బాగోతంలో ఉన్నతాధికారుల పాత్ర ఉన్న ట్టు తీవ్ర ఆరోపణలు వచ్చినందున వారిపై వ్యాజ్యాన్ని ఉపసంహరించుకునేందుకు పిటిషనర్‌ను అనుమతించరాదని హైకోర్టు రిజీస్ట్రీకి ఉత్తర్వులు జారీ చేసింది. ఆ భూముల్లో కొంత భాగాన్ని డీజీపీ రేసులో ఉన్న సీనియర్ ఐపీఎస్ తన భార్య పేరుతో కొనుగోలు చేశా రు. ప్రస్తుతం హైకోర్టు ముందున్న ఈ కేసు ఆయన కెరీర్లో ఓ రిమార్కుగా మారే ప్రమాదం ఉందని పలువురు భావిస్తున్నారు. దీనితోపాటు వికారాబాద్ జిల్లా లగచర్లలో భూసేకరణపై చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలు, కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారంలో హెచ్‌సీ యూ విద్యార్థుల ఆందోళనలపై ఆయన తమను అప్రమత్తం చేయలేదని ప్రభుత్వ పెద్దలు ఆగ్రహంతో ఉన్నట్టు వినికిడి.
రెండోసారి ఐదుగురు డీజీపీ ర్యాంకు అధికారుల జాబితాతో ఫైల్ యూపీఎస్సీకి వెళ్లింది. డీజీపీ పోస్టు కోసం పోటీపడుతున్న ఇద్దరు ఐపీఎస్‌ల వర్గపోరు వల్లే ఆ ఫైల్ రాక ఆలస్యమైనట్టు విశ్వనీయ సమాచారం.
యూపీఎస్సీకి పంపిన జాబితాలో సీనియార్టీ ప్రకారం ప్రధానంగా రవిగుప్తా, సీవీ ఆనంద్, శివధర్‌రెడ్డి, సౌమ్య మిశ్రా, శిఖా గోయెల్ పేర్లు ఉన్నట్టు తెలిసింది. తెలంగాణ నుంచి డిప్యూటేషన్‌పై సెంట్రల్ ఇంటెలిజెన్స్ బ్యూరో డీజీ హోదాలో పనిచేస్తున్న వినాయక్ ప్రభాకర్ ఆప్టే మళ్లీ తెలంగాణకు వచ్చే అ వకాశాలు లేవు. సీనియార్టీలో అందరికంటే ముం దున్న హోంశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రవిగుప్తా ఇ ప్పటికే తెలంగాణకు డీజీపీగా పనిచేశారు. ఈ ఏడాది చివర్లో ఆయన పదవీ విరమణ చేయనున్నారు.
డీజీపీ పదవికి యూపీఎస్పీ నుంచి వచ్చే జాబితా లో సీనియార్టీ ప్రకారం రవిగుప్తా, సీవీ ఆనంద్, శివధర్‌రెడ్డి పేర్లు ఉంటాయని భావిస్తున్నారు. రాష్ట్ర సర్వీసులపై వినాయక్ ప్రభాకర్ ఆప్టేకు మొదట్నుంచే ఆసక్తి లేకపోవడంతో ఆ స్థానంలో శిఖా గోయెల్ పేరు కూడా యూపీఎస్పీ ప్రతిపాదించవచ్చని తెలుస్తున్నది. అదే జరిగితే డీజీపీ పదవి దక్కే అవకాశం శిఖా గోయెల్కే ఎక్కువగా ఉందని అంటున్నారు. సెప్టెంబర్‌లో నియమితులయ్యే డీజీపీ తెలంగాణకు పూర్తిస్థాయి పోలీస్ బాస్‌గా సేవలందించనున్నారు.