మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకుల మండలంలోని సుంకరామయ్యపల్లి గ్రామంలో అబ్బాయి.. బాబాయ్ మధ్య సర్పంచ్ ఎన్నికలు (Sarpanch Elections) పోటీ పెట్టా యి. వారిరువురు నువ్వా.. నేనా.. అన్నట్టు పోటాపోటీ ప్రచారం చేస్తున్నారు. ఎవరికి వారు తగ్గెదే లేదంటూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. బాబాయ్ బీఆర్ఎస్ నాయకుడు, అబ్బాయ్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు. అయితే సర్పంచ్ ఎన్నికల్లో ఆ గ్రామానికి జనరల్ రిజర్వేషన్ కేటాయించారు. దీంతో గ్రామంలో ఉండే రెడ్డి వర్గంతోపాటు గ్రామపెద్దలు అంతా కలిసి వారి ఇద్దరిని కూర్చోబెట్టి సర్పంచ్‌గా ఏకగీవ్రం చేయాలనే సంకల్పంతో చర్చలు జరిపారు. అందులో బాబాయ్ ఆకులమోని రవి మంచితనంతోపాటు గతంలో పోటీ చేసి ఓడిపోయినందుకు అతనినే సర్పంచ్‌గా చేయాలని గ్రామస్తులు నిర్ణయించారు. అందుకు అతను గ్రా మంలోని దేవాలయానికి రూ.8 లక్ష లు ఇస్తానని ఒప్పుకోగా గ్రామస్తులు కూడా అతడినే సర్పంచ్ అని నిర్ణయించారు.
కానీ కొంత మంది కాంగ్రెస్ పార్టీ పెద్దలు అతనితో నిన్నే ఏకగ్రీవం చేస్తున్నాం ఇక నువ్వే సర్పంచ్‌వి. కానీ కాంగ్రెస్ కండువా కప్పుకోవాలని పట్టుబట్టినట్లు తెలిసింది. అయితే అందుకు అతను నేను పార్టీలు మారను. గ్రామాభివృద్ధి కోసం అందరినీ కలుపుకొని కట్టుబడి పనిచేస్తా. తనకు పదవి లేకున్నా సరే.. కానీ బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి మారేదే లేదని తేల్చిచెప్పాడు. దీంతో ఎన్నికల పంచాయితీ మళ్లీ మొదటికి వచ్చింది. పార్టీ మారకుంటే మా పార్టీ తరపున కూడా పోటీ చేయిస్తామని రవి అబ్బాయి అయిన ఆకులమోని చెన్నకేశవులును కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలోకి దించారు. దీంతో వారిమధ్య పోటీ కొనసాగుతున్నది. మరి బాబాయ్ సర్పంచ్‌గా గెలుస్తాడో.. అబ్బాయి సర్పంచ్‌గా గెలుస్తాడో బుధవారం సాయంత్రం తేలనుంది. బుధవారం మూడో విడత పంచాయతీ ఎన్నికలు జరుగనున్నాయి. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ కొనసాగుతుంది. 2 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. అనంతరం ఫలితాలను ప్రకటిస్తారు.