Kumbh Mela | పోతంగల్ ఫిబ్రవరి 22: నిజామాబాద్ జిల్లాకు చెందిన ఇద్దరు యువకులు అరుదైన సాహసం చేశారు. స్కూటీపై కుంభమేళా యాత్రకు వెళ్లొచ్చారు. కేవలం ఐదు రోజుల్లోనే వీరు తమ యాత్రను పూర్తి చేసుకుని రావడం విశేషం.
వివరాల్లోకి వెళ్తే.. నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండలానికి చెందిన ఇద్దరు యువకులు సితాల సంతోశ్, సాదుల శ్రీధర్ ఇద్దరు స్నేహితులు. కుంభమేళాకు అందరూ వెళ్తుండటంతో తాము కూడా వెళ్లి రావాలని అనుకున్నారు. 144 ఏండ్లకు ఒకసారి వచ్చే ఈ మహాకుంభమేళాలో పవిత్ర స్నానం చేయాలని భావించారు. అనుకున్నదే తడవుగా యాత్రకు సిద్ధమయ్యారు. అయితే అందరిలా వీళ్లు బస్సులు, ట్రైన్లలో కాకుండా బైక్‌పై వెళ్లాలని నిర్ణయించారు.
అనుకున్నదే తడువుగా ఈ నెల 18వ తేదీన ( మంగళవారం) పోతంగల్ మండలం నుంచి బయల్దేరి ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లారు. త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం వారణాసికి వెళ్లి కాశీ విశ్వేశ్వరుడిని దర్శించుకున్నారు. అక్కడి నుంచి బయల్దేరి శనివారం మధ్యాహ్నానికి పోతంగల్‌కు చేరుకున్నారు. మొత్తం ఐదు రోజుల పాటు జరిగిన వీరి బైక్ యాత్రలో సుమారు 2500 కిలోమీటర్లు చుట్టేసి వచ్చారు. ఈ సందర్భంగా వారికి కుటుంబసభ్యులు, బంధుమిత్రులు సాదరస్వాగతం పలికారు. ఈ యాత్ర తమకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని తెలిపారు.