హైదరాబాద్, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ): లగచర్లలో భూసేకరణ వివాదానికి సంబంధించిన కేసులో పోలీసులు ఇష్టారీతిన ఎఫ్ఐఆర్లను దాఖలు చేయడాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. ఇష్టం వచ్చినట్టు మూడు ఎఫ్ఐఆర్లు నమోదు చేయడానికి వీల్లేదని తేల్చిచెప్పింది. ఒకే ఎఫ్ఐఆర్ (153)పైన మాత్రమే కేసు దర్యాప్తు చేయాలని పోలీసులకు ఉత్తర్వులు జారీ చేసింది.
ఎఫ్ఐఆర్ 154, 155లో ఇప్పటివరకు ఎవరి వాంగ్మూలాలనైనా నమోదు చేసి ఉంటే వాటిని 153 ఎఫ్ఐఆర్లో పరిగణనలోకి తీసుకోవాలని చెప్పింది. ఎఫ్ఐఆర్ 154, 155లను కొట్టివేస్తూ సోమవారం జస్టిస్ కె.లక్ష్మణ్ తీర్పు వెలువరించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూసేకరణ వివాదంలో అధికారులపై దాడులు చేశారంటూ బొమ్రాస్పేట పోలీసులు తొలుత ఎఫ్ఎఆర్ (నం.153) నమోదు చేశారు.
ఆ తర్వాత అదే ఆరోపణలపై మరో రెండు ఎఫ్ఐఆర్లు నమోదు చేయడాన్ని రైతులు హైకోర్టులో సవాల్ చేశారు. నిరుడు నవంబర్ 11న లగచర్లలో భూసేకరణపై ప్రజాభిప్రాయ సేకరణ పేరుతో నిర్వహించిన సమావేశంలో ఉద్రిక్తత చోటుచేసుకున్నది. ఈ క్రమంలో కొందరు రైతులు అధికారులపై దాడి చేశారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో పిటిషనర్ల తరఫు న్యాయవాది టీవీ రమణరావు చేసిన వాదనలను హైకోర్టు ఆమోదించింది.