వేలేరు/తాంసి, మార్చి 19: ఓ వైపు అప్పుల భారం.. మరోవైపు నీళ్లు లేక పంటలు దక్కకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఇద్దరు రైతులు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. హనుమకొండ, ఆదిలాబాద్ జిల్లాల్లో జరిగిన ఈ ఘటనలకు సంబంధించిన వివరాలు ఇలా.. హనుమకొండ జిల్లా వేలేరు మండలం పీచర గ్రామానికి చెందిన రైతు పిట్టల సుధాకర్ (43) తనకున్న మూడెకరాల్లో వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. బావిలో భూగర్భ జలాలు అడుగంటి సాగునీరు అందకపోవడంతో నెల రోజుల క్రితం ఒక బోరు, మళ్లీ వారం, పది రోజుల క్రితం మరో బోరు వేశాడు. అప్పులు చేసి బోర్లు వేసినా నీరు రాకపోవడంతో చేతికందిన పంటలు ఎండిపోయాయి. దానికి తోడు కుమార్తె పెండ్లికి చేసిన అప్పులు కలిపి సుమారు రూ.8 లక్షల వరకు ఉండటంతో ఎలా తీర్చాలో అర్థంకాక తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. సోమవారం సుధాకర్ బాయికాడికి పోయి వ్యవసాయానికి తెచ్చిన పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చుట్టుపక్కల రైతులు చూసి సుధాకర్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అక్కడికి వెళ్లి చూడగా అప్పటికే సుధాకర్ మరణించి ఉన్నాడు. మృతదేహాన్ని ఎం జీఎం దవాఖానకు తరలించారు.
ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మం డలం బరంపూర్‌కు చెందిన రైతు కాకేర్ల ఆశన్న(43), సుచరిత భార్యాభర్తలు. వీరికి కూతురు, కుమారుడు ఉన్నారు. తమనకున్న ఆరెకరాల్లో వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఆశన్న పే రిట 2.19 ఎకరాలు, సుచరిత పేరిట 3.20 ఎకరాల భూమి ఉన్నది. మూడేండ్లుగా పత్తి సాగు చేశారు. ఇందుకోసం తెలంగాణ దక్కన్ గ్రామీణ బ్యాంకులో రూ.3 లక్షలు, ప్రైవేట్‌గా రూ.2 లక్షలు అప్పు చేశారు. ఈ యాసంగిలో జొన్న సాగు చేశారు. ఇందుకోసం ప్రైవేట్‌గా రూ. లక్ష అప్పు తీసుకొచ్చారు. ఈసారి కూడా దిగుబడి వచ్చే పరిస్థితి లేకపోవడంతో అప్పులు ఎలా తీర్చాలని మనస్తాపం చెందాడు. మంగళవారం చేనుకు నీరు పెట్టడానికి అని ఇంట్లో చెప్పి వెళ్లాడు. చేనులోనే పురుగుల మందుతాగాడు. కుటుంబ సభ్యులు ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించగా.. అప్పటికే మరణించినట్టు వైద్యులు తెలిపారు.